పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉంది: భట్టి

ABN , First Publish Date - 2020-08-18T21:28:35+05:30 IST

రాష్ట్రంలో పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే

పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉంది: భట్టి

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కలిశారు. కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. డీజీపీతో భేటీ అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. భద్రాచలం నియోజకవర్గంలో పులిగుండాల గ్రామ సర్పంచ్ చలపతిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలకు గురిచేస్తున్నారని అన్నారు. సర్పంచ్‌కి మావోయిస్టులతో సంబంధాలు అంటగడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని, చలపతి అరెస్ట్‌ను ఖండిస్తున్నామని భట్టి స్పష్టం చేశారు. మావోయిస్టు భావజాలం ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో చలపతి పోటీచేసే వాడే కాదని ఆయన పేర్కొన్నారు. 


వచ్చినవారెవరో తెలియక భోజనం పెడితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు కాదని, అతన్ని వెంటనే విడుదల చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో కూడా కాంగ్రెస్‌ సర్పంచ్‌లను వేధించడం మానుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ బెదిరింపులకు కాంగ్రెస్ సర్పంచులెవరూ భయపడొద్దని భట్టి అన్నారు. సర్పంచ్‌లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రతిపక్ష నేతలను వేధించడంపై పెట్టే శ్రద్ధను ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంపై పెడితే బాగుంటుదని భట్టి విక్రమార్క హితవు చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని భట్టి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-18T21:28:35+05:30 IST