జాదూ బెట్టింగ్‌ గ్యాంగ్‌

ABN , First Publish Date - 2020-10-13T10:07:55+05:30 IST

‘హలో.. రాజస్థాన్‌ రాయల్స్‌పై 10 వేలు బెట్టింగ్‌.. ఆరో ఓవర్లో సిక్సర్‌పై బెట్‌’’.. ‘‘ఢిల్లీ జట్టు స్కోరు 200 దాటుతుంది..

జాదూ బెట్టింగ్‌ గ్యాంగ్‌

లొకేషన్‌ డైవర్షన్‌తో పోలీసులకు బురిడీ...

గచ్చిబౌలిలో ఉంటూ.. విదేశాల సిగ్నలింగ్‌

రాజస్థాన్‌ ఏటీఎస్‌ అరెస్టు చేసిన ముఠా తీరు

దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో సభ్యులు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘హలో.. రాజస్థాన్‌ రాయల్స్‌పై 10 వేలు బెట్టింగ్‌.. ఆరో ఓవర్లో సిక్సర్‌పై బెట్‌’’.. ‘‘ఢిల్లీ జట్టు స్కోరు 200 దాటుతుంది.. రూ.లక్ష బెట్టింగ్‌..’’ ఇదీ బెట్టింగ్‌ గ్యాంగ్‌లు, బుకీలు, పంటర్లకు మధ్య జరిగే సంభాషణలు. ఇలాంటి సంభాషణలపై ఓ కన్నేసి ఉంచే నిఘావర్గాలు.. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్ల ఆధారంగా బెట్టింగ్‌ రాకెట్ల ఉనికిని కనిపెడుతాయి. అయితే.. ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌ ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్‌), సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం(ఎస్వోటీ) పోలీసులు గచ్చిబౌలిలో జరిపిన దాడుల్లో పట్టుబడ్డ రాజస్థాన్‌ బెట్టింగ్‌ గ్యాంగ్‌ ఇలాంటి సెల్‌లొకేషన్‌ ట్రాకింగ్‌కు అతీతం. ఇందుకోసం ఈ ముఠా ఏకంగా ‘సిగ్నల్‌ రేంజ్‌ డైవర్టర్‌’ పరికరాన్ని సమకూర్చుకుంది. దీని వల్ల గచ్చిబౌలిలో ఉంటున్న ముఠా.. నల్లగొండలో ఉన్నట్లో.. ముంబైలో ఉంటున్నట్లో.. లేదా ఇతర దేశాల్లోంచి ఆపరేట్‌ చేస్తున్నట్లో టవర్‌ లొకేషన్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంతటి అధునాతన పరికరాలు సమకూర్చుకున్నా.. ప్రతివ్యూహంతో నిందితులకు బేడీలు వేసినట్లు రాజస్థాన్‌ ఏటీఎస్‌ అదనపు డీజీ అశోక్‌ రాథోడ్‌ వెల్లడించారు. ఈ ముఠాకు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో సభ్యులున్నట్లు గుర్తించామని, వారి కోసం వేట కొనసాగిస్తున్నామని చెప్పారు.


ఇదీ నేరశైలి..

ఈ ముఠా ఐపీఎల్‌ బెట్టింగ్‌ కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. తమ కస్టమర్లకు ఆ యాప్‌ ద్వారా నగదు బదిలీ, బెట్టింగ్‌కు అవకాశం కల్పిస్తోందని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ముందే పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకునే ఈ గ్యాంగ్‌.. వేర్వేరు నగరాల్లోని తమ బుకీలను యాక్టివ్‌ చేస్తుంది. అయితే.. ఏ నగరానికి చెందినవారు ఆ నగరంలో బెట్టింగ్‌ను ఆపరేట్‌ చేయరు. ఉదాహరణకు సన్‌రైజర్స్‌ - ముంబై మధ్య మ్యాచ్‌ ఉంటే.. హైదరాబాదీ బుకీలు ముంబైలో తిష్టవేసి.. అక్కడి నుంచి బెట్టింగ్‌ను ఆపరేట్‌ చేస్తారు. అదేవిధంగా ముంబైలోని బుకీలు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చుకుంటారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకే ఇలా నగరాలను మారుస్తుంటారని రాజస్థాన్‌ ఏటీఎస్‌ గుర్తించింది. ఆదివారం నాటి దాడుల్లో కూడా.. హైదరాబాద్‌లో పట్టుబడ్డవారంతా రాజస్థాన్‌కు చెందినవారు. ముంబైలో పోలీసుల దాడికి కొన్ని క్షణాల ముందు తప్పించుకున్నవారు హైదరాబాద్‌కు చెందిన బుకీలు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు..హైదరాబాదీ బుకీలు ముంబై నుంచి ఆపరేట్‌ చేస్తూ.. తమ సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ను హైదరాబాద్‌కు అనుసంధానం చేస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.


ఏటీఎస్‌ ప్రతివ్యూహం ఇలా..

భారీ ఎత్తున బెట్టింగ్‌ సాగుతున్నా.. సరైన లొకేషన్స్‌ అందకపోవడంతో పోలీసులు కూడా సాంకేతికతను వినియోగించారు. తప్పుడు లొకేషన్‌ చూపుతున్న రేంజ్‌ డైవర్టర్‌ను డామినేట్‌ చేసి.. అసలు లొకేషన్‌ను గుర్తించేందుకు పది రోజులపాటు కసరత్తు చేశారు. ఇందుకు నిఘావర్గాల సహకారం తీసుకున్నారు. అలా.. బెట్టింగ్‌ ముఠా సభ్యుల లొకేషన్లను గుర్తించి.. ఆదివారం ఏకకాలంలో ఐదు నగరాల్లో దాడులు జరిపారు. గచ్చిబౌలిలో ఏడుగురు.. మరో మూడు నగరాల్లో ఇంకో ఏడుగురు బుకీలు చిక్కారు. ఇదే క్రమంలో ఈ గ్యాంగ్‌కు విదేశీ ముఠాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మ్యాచ్‌ఫిక్సింగుల్లో కూడా ఈ ముఠా ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. గచ్చిబౌలిలో చిక్కిన వారి ఫొటోలు, వివరాలను సైబరాబాద్‌ పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఇక్కడ అరెస్టయిన వారిలో రాజస్థాన్‌కు చెందిన అశోక్‌ కుమార్‌ చాలానీ, గణేశ్‌మాల్‌ చాలానీ, పంకజ్‌శెట్టి, సురేందర్‌ చాలానీ, శాంతిలాల్‌ బేద్‌, బేరారం పురోహిత్‌, మనోజ్‌ పాస్వాన్‌లు ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2020-10-13T10:07:55+05:30 IST