‘క్వారంటైన్’ను సమీపిస్తే స్మార్ట్‌ఫోన్‌లో అలర్ట్
ABN , First Publish Date - 2020-04-05T08:11:59+05:30 IST
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తెలంగాణ పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. క్వారంటైన్‌లో ఉన్న 25 వేల మంది వివరాలను ఇప్పటికే సేకరించి...

- హాక్-ఐ యాప్‌లో కొత్త ఫీచర్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తెలంగాణ పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. క్వారంటైన్‌లో ఉన్న 25 వేల మంది వివరాలను ఇప్పటికే సేకరించి, జియోట్యాగింగ్ చేశారు. హాక్-ఐ పోలీసు యాప్‌తో ఇప్పుడు ఆ డేటాను అనుసంధానం చేశారు. ఇప్పటికే చాలా మంది పౌరులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఎమర్జెన్సీ సేవలు మొదలు, ఫిర్యాదులు చేయడం, షీటీమ్స్‌కు సమాచారం అందించడం వంటి సేవలను పొందుతున్నారు. తాజాగా పోలీసులు అప్‌డేట్ చేసిన హాక్-ఐలో ‘క్వారంటైన్ ఏరియా అలర్ట్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్‌ను యాక్టివ్ చేసుకునే హాక్-ఐ వినియోగదారులు.. క్వారంటైన్ అయిన వ్యక్తులు ఉన్న ప్రదేశానికి వెళ్లగానే.. స్మార్ట్‌ఫోన్‌కు అలర్ట్ వస్తుంది. 50 మీటర్ల దూరంలోనే క్వారంటైన్ అయిన వ్యక్తులు అక్కడ ఉన్నారని హెచ్చరిస్తుంది. పౌరులు అప్రమత్తమై, ఆ మార్గంలో వెళ్లకపోవడమో, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడమో, వెనక్కి తిరిగి వెళ్లడమో చేయవచ్చు.