లంచం ఇవ్వడం కోసం భిక్షాటన
ABN , First Publish Date - 2020-12-27T07:17:59+05:30 IST
మంచిర్యాల జిల్లా తాండూర్ గ్రామానికి చెందిన తౌటం రాజేంద్రప్రసాద్ అనే యువరైతు భూమి విషయంలో తనకు

భూమి సమస్య పరిష్కరించని అధికారులపై యువరైతు పోరాటం
తాండూర్(బెల్లంపల్లి), డిసెంబరు 26: మంచిర్యాల జిల్లా తాండూర్ గ్రామానికి చెందిన తౌటం రాజేంద్రప్రసాద్ అనే యువరైతు భూమి విషయంలో తనకు అన్యాయం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ శనివారం ఐబీ చౌరస్తాలో భిక్షాటన చేశారు. అనంతరం నిరాహార దీక్ష చేపట్టారు. తాండూర్ శివారులోని 612/అ/5, 612/5/అ సర్వే నెంబర్లలో 8 ఎకరాల భూమి కొనుగోలుచేసి పదేళ్ళుగా సాగు చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. భూమికి సంబంధించి అన్ని పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయన్నారు. కొందరు కబ్జాదారులు బెదిరిస్తున్నారని వాపోయారు. తన భూమికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, అధికారులకు లంచం కొరకు భిక్షాటన చేస్తున్నానని చెప్పారు. తహశీల్దార్ కవితను వివరణ కోరగా రాజేంద్రప్రసాద్‌కు సంబంధించిన భూమి వివాదంలో ఉందని, విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలు అందించామన్నారు. వివాదంలో ఉన్న భూములు ధరణి వెబ్‌సైట్‌లో కేటగిరి పార్టు బిలో ఉండడంతో సమస్యను పరిష్కరించలేక పోతున్నామని చెప్పారు.