చేతిలో లక్ష ఉంటేనే బెడ్
ABN , First Publish Date - 2020-06-23T09:09:11+05:30 IST
కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసినా.. నిబంధనలను, మార్గదర్శకాలను జారీ చేసినా.. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. లక్ష రూపాయలు బయానా (అడ్వాన్స్) కడితేనే కొవిడ్-19 చికిత్సకు

- అదికూడా లక్షణాల్లేని వారికే..!
- అసలు రోగులకు తప్పని తంటాలు
- సర్కారుకు ఫిర్యాదుల పరంపర
- నేడు ఆస్పత్రులతో ఈటల భేటీ
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసినా.. నిబంధనలను, మార్గదర్శకాలను జారీ చేసినా.. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. లక్ష రూపాయలు బయానా (అడ్వాన్స్) కడితేనే కొవిడ్-19 చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రులు పేషెంట్లను చేర్చుకుంటున్నాయి. వారికి బిల్లులు చెల్లించే స్తోమత ఉందా? బీమా పాలసీలు ఉన్నాయా? అనే విషయాన్ని నిర్ధారించుకున్నాకే.. చికిత్స ప్రారంభిస్తున్నాయి. అదికూడా కరోనా లక్షణాలు లేనివారికే ప్రాధాన్యమిస్తున్నాయి. అలాంటి వారితో ఇప్పుడు ఆయా ఆస్పత్రుల్లోని పడకలు నిండిపోయాయి. దీంతో.. పరిస్థితి తీవ్రంగా ఉన్న అసలు కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వారితోపాటు.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకూ బెడ్స్ దొరకడం లేదు. నిజానికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయినా.. ఎలాంటి లక్షణాలు లేనివారికి ఇళ్లలోనే చికిత్స ఇవ్వాలని.. వారికి ఇంటి వద్ద ఐసోలేషన్ సదుపాయం లేకుంటే.. సర్కారీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టంగా పేర్కొంది. కానీ, కార్పొరేట్ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా ఆ నిబంధనను పాటించడం లేదు. ప్రస్తుతం 400 మంది వరకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొవిడ్-19కు చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో చాలా మందికి కరోనా లక్షణాలు లేవని సర్కారు దృష్టికి వచ్చింది. దీనికితోడు కార్పొరేట్ ఫీజులపై ప్రభుత్వానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆస్పత్రుల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. ప్రైవేటులో అనుసరిస్తున్న విధానాలపై వారితో చర్చించి, విధివిధానాలను రూపొందించనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే ప్రైవేటు ల్యాబ్‌లతో కూడా మంత్రి ఈటల సమావేశం కానున్నారు. వారు నిబంధనల ప్రకారమే టెస్టు చార్జీలు వసూలు చేస్తున్నా.. సేకరించిన నమూనాలు, పాజిటివ్‌ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం లేదు. ఇది వైద్యఆరోగ్యశాఖకు ఇబ్బందిగా మారింది. దీనిపైనా మంత్రి వారితో చర్చించనున్నారు.