జిల్లాలో కానరాని బతుకమ్మ సంబరాలు
ABN , First Publish Date - 2020-09-18T06:38:00+05:30 IST
అధిక మాసం రావడంతో ఈసారి బతుకమ్మ వేడుకలను వచ్చే నెల 16 నుంచే ఆడుకోవాలన్న పిలుపునకు ఎక్కువ మంది

అక్టోబర్ 16 నుంచి జరుపుకొనేందుకే మొగ్గు
వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ ఆడిన మహిళలు
వరంగల్ కల్చరల్, సెప్టెంబర్ 17: అధిక మాసం రావడంతో ఈసారి బతుకమ్మ వేడుకలను వచ్చే నెల 16 నుంచే ఆడుకోవాలన్న పిలుపునకు ఎక్కువ మంది మహిళలు మొగ్గు చూపారు. గురువారం ఒకటీ రెండు చోట్ల తప్ప ఎక్కడా ఎంగిలిపూల బతుకమ్మను ఆడలేదు. పితృ అమావాస్య రోజున బతుకమ్మను పేర్చాలన్న సెంటిమెంట్‌తో కొందరు మహిళలు ఇంటివద్దనే బతుకమ్మ ఆడారు. కాగా హన్మకొండలోని రుద్రేశ్వర స్వామివారి వేయి స్తంభాల గుడి ఆవరణలో బతుకమ్మ వేడుకల్లో కొద్ది మంది మహిళలే పాల్గొన్నారు. సాయంత్రానికి సుమారు 30 నుంచి 40 మంది మహిళలు మాత్రమే బతుకమ్మలతో గుడికి వచ్చారు.
బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో భిన్నాభిప్రాయలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.. సాధారణంగా భాద్రపద అమావాస్య (పితృ అమావాస్య) రోజు నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి అధిక మాసం రావడంతో ఆశ్వయుజ మాసంలో అక్టోబర్ 16నుంచి జరుపుకోవాలని వేదపండితులు, పంచాంగకర్తలు పిలుపునిచ్చారు. కొందరు గురువారం ఒక్క రోజు బతుకమ్మను ఆడి మళ్లీ అక్టోబర్ 16 నుంచి 8 రోజులు ఆడాలని సూచించారు. దీంతో పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో అయోమయం నెలకొంది. అయితే మెజారిటీ మహిళలు అక్టోబర్ 16 నుంచే జరుపుకోవాలన్న పిలుపునకు మోగ్గు చూపారు. దీంతో గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా బతుకమ్మ సంబరాలు కనిపించలేదు.