బార్లు, పబ్బులు 8 నుంచి ఓపెన్‌?

ABN , First Publish Date - 2020-06-06T08:25:37+05:30 IST

రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి బార్లు, పబ్బులు తెరుచుకునే అవకాశాలున్నాయి. ఈమేరకు ఆబ్కారీ శాఖ అనుమతించనుందని సమాచారం.

బార్లు, పబ్బులు 8 నుంచి ఓపెన్‌?

రెస్టారెంట్ల నిబంధనలే బార్లకూ వర్తింపు

నేడో రేపో ఉత్తర్వులు ఇవ్వనున్న ఆబ్కారీ శాఖ 

వెయ్యికిపైగా బార్లు 65 రోజులుగా మూత

మద్యం షాపులకు నెల క్రితమే అనుమతి


హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి బార్లు, పబ్బులు తెరుచుకునే అవకాశాలున్నాయి. ఈమేరకు ఆబ్కారీ శాఖ అనుమతించనుందని సమాచారం. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌కు ముందే (మార్చి 15 నుంచే) రాష్ట్రంలోని 1000కి పైగా బార్లు, పబ్బులు, క్లబ్బు(మద్యం అందుబాటులో ఉండేవి)లు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 8 నుంచి అమలు చేయనున్న లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వీటికీ అనుమతి లభించనుందని తెలిసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకోనున్నాయి. అందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. సాధారణంగా ప్రతి బార్‌కు రెస్టారెంట్‌ సౌకర్యం ఉంటుంది. మద్యంతో పాటే ఫుడ్‌ సర్వింగ్‌ ఉంటుంది.


రెస్టారెంట్లు తెరుచుకోనుండటంతో.. బార్లకు కూడా అనుమతినివ్వాలని ఎక్సైజ్‌ శాఖ యోచిస్తోంది. రెస్టారెంట్లలో నిబంధనలనే బార్లలో పాటిస్తే పెద్దగా సమస్య ఉండదని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది. బార్లు, పబ్బులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే వీటికి కూడా 8 నుంచి అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించిందని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడవచ్చని తెలిసింది.


లాక్‌డౌన్‌లో చేనేతలను ఆదుకున్నారా?: హైకోర్టు

లాక్‌డౌన్‌ కాలంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలపాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చేనేతలకు ఆర్థిక సహాయం అందించే పథకాలేంటి? లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన చేనేత కార్మికులకు ఇచ్చిన రుణాలను ప్రభుత్వం రద్దు చేస్తుందా? వంటి అంశాలకు సమాధానమిస్తూ ఒక నివేదిక సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.


లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. చేనేత కార్మికుల వద్ద పెద్దఎత్తున నిల్వలు నిలిచి పోయాయని, సహకార సంఘాలుగానీ, ప్రభుత్వం గానీ స్టాక్స్‌ కొనుగోళ్లు చేయడం లేదని పిటిషనర్‌ తరఫున న్యాయవాది రంగయ్య వాదించారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తక్షణమే కొంత మొత్తాన్ని అందించే అవకాశాలను పరిశీలించాలని ధర్మాసనం సూచించింది.  


కరోనా సోకి మధుసూదన్‌ మృతి: సర్కారు

హైదరాబాద్‌కు చెందిన అల్లంపల్లి మధుసూదన్‌ కరోనా సోకి చికిత్స పొందు తూ మరణించారని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు నివేదించారు. ఆయన కుటుంబసభ్యులంతా క్వారంటైన్‌లో ఉన్నందున ఇంటి పక్కనున్న వారికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ వివరణ విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. తన భర్త మధుసూదన్‌ ఆచూకీ తెలపాలని ఆయన భార్య మాధవి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వివరణ ఇస్తూ... మధుసూదన్‌ కరోనాకు చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు.  

Updated Date - 2020-06-06T08:25:37+05:30 IST