బండి సంజయ్‌ వాహనంపై దాడి

ABN , First Publish Date - 2020-12-01T07:36:01+05:30 IST

మరికొద్ది గంటల్లో బల్దియా ఎన్నికల పోలింగ్‌ అనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కారుపై దాడి జరిగింది. ఖైరతాబాద్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయారెడ్డి అనుచరులు, సోమవారం రాత్రి నెక్లెస్‌ రోడ్డులో సంజయ్‌ వాహనంపై దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు

బండి సంజయ్‌ వాహనంపై దాడి

నెక్లెస్‌ రోడ్డులో వాహ్యాళికి బీజేపీ నేత

వెళ్లబోతుండగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో

అక్కడికి  విజయారెడ్డి.. వాహనానికి అడ్డు

ఆయన కారు అద్దాలు ధ్వంసం 

డబ్బులు పంచుతున్నారని విజయ ఆరోపణ 

అక్కడి నుంచి సంజయ్‌ని సురక్షితంగా 

తరలించిన పోలీసులు

వ్యాహ్యాళికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

పోలీసుల సూచనతో వాహనమెక్కిన బండి 

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో వచ్చిన విజయారెడ్డి

సంజయ్‌ వాహనానికి అడ్డంగా నిల్చున్న వైనం

కారు అద్దాలు ధ్వంసం చేసిన కార్యకర్తలు

తోపులాటల మధ్య కింద పడ్డ విజయారెడ్డి 

రంగంలోకి పోలీసులు.. సంజయ్‌ తరలింపు


ఖైరతాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మరికొద్ది గంటల్లో బల్దియా ఎన్నికల పోలింగ్‌ అనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కారుపై దాడి జరిగింది.  ఖైరతాబాద్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయారెడ్డి అనుచరులు, సోమవారం రాత్రి నెక్లెస్‌ రోడ్డులో సంజయ్‌ వాహనంపై దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు.   పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి   సంజయ్‌ను కారులో అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   ప్రచారం హోరులో తీరిక లేకుండా గడిపిన బండి సంజయ్‌.. వ్యాహ్యాళి కోసం తన అనుచరులతో కలిసి రెండు కార్లలో నెక్లెస్‌ రోడ్డుకు వచ్చారు. ఆటవిడుపు కోసం అక్కడికి వచ్చిన వారితో కాసేపు బంతి ఆట ఆడారు. ఆ తర్వాత ఈట్‌ స్ట్రీట్‌లోకి వెళ్లారు. సంజయ్‌, నెక్లెస్‌ రోడ్డులో ఉన్నారంటూ ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డికి కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చెప్పారు. ఆమె సమాచారం మేరకు పోలీసులు   వెళ్లి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సంజయ్‌ను కోరారు. ‘‘నేను ఇక్కడికి వచ్చింది ఆటవిడుపు కోసమే టిఫిన్‌ చేసి, టీ తాగుదామని వచ్చాను’’ అని పోలీసులకు సంజయ్‌ చెప్పారు.


అనంతరం ఈట్‌ స్ట్రీట్‌లో టిఫిన్‌ చేసి, టీ తాగిన సంజయ్‌.. తన కారులో ఎక్కి కూర్చున్నారు. అంతలో  విజయారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని బండి సంజయ్‌ వాహనానికి అడ్డంగా నిలబడ్డారు. సమాచారం అందుకున్న బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ‘జై శ్రీరామ్‌, బీజేపీ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు.  ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ‘జై టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ జిందాబాద్‌’ అంటూ.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. తోపులాటలో విజయారెడ్డి కిందపడటంతో కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికి దిగారు. పోలీసులు కలుగజేసుకొని చాకచక్యంగా బండి సంజయ్‌ను కారులో అక్కడి నుంచి తరలించారు. ఆయనకు చెందిన మరో కారులో ఉన్న అనుచరులు అక్కడి నుంచి వెళ్లకుండా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారులో ఉన్నవారిని బయటకు లాగే ప్రయత్నం చేయగా  పోలీసులు అడ్డుకున్నారు.


దీంతో ఆగ్రహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు... బండి సంజయ్‌ అనుచరులు ఉన్న వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికే  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇక్కడికి వచ్చారని, అయన కారులో డబ్బులు ఉన్నాయని, అయినా పోలీసులు తనిఖీలు చేయకుండా వదిలేశారని విజయారెడ్డి ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయారెడ్డి అనుచరులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. సంజయ్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ బీజేపీ కార్యకర్తలు రాంగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.


బండిపై దాడి జరగలేదు: పోలీసులు

కాగా సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బండి సంజయ్‌పై ఎలాంటి హత్యాయత్నం జరగలేదని స్పష్టం చేశారు. ఆటవిడుపు కోసం వచ్చిన ఆయనను వెంటనే అక్కడి నుంచి పంపించామని పేర్కొన్నారు. హత్యాయత్నం జరిగిందని తప్పుడు వార్తలు, ట్రోల్‌ చేయొద్దని మీడియాకు తెలియజేశారు. 

Updated Date - 2020-12-01T07:36:01+05:30 IST