బండికి అధ్యక్ష పదవి.. లక్ష్మణ్‌ కోరిక నెరవేరుతుందా!?

ABN , First Publish Date - 2020-03-12T14:36:42+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను అధిష్టానం ప్రకటించడంతో

బండికి అధ్యక్ష పదవి.. లక్ష్మణ్‌ కోరిక నెరవేరుతుందా!?

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను అధిష్టానం ప్రకటించడంతో, ఆపార్టీ ముషీరాబాద్‌ నియోజకవర్గం నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. రెండోసారి తిరిగి డా. లక్ష్మణ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ఎదురుచూసిన వారికి ఆశాభంగం కలిగింది. బుధవారం పార్టీ అధిష్టానం కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రకటించింది. దీంతో నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. 1999, 2014లో ఎన్నికల్లో ఎమ్మెల్య్గేగా గెలిచిన లక్ష్మణ్‌ 2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా కీలక పదవుల్లో కొనసాగారు. 


కనీసం పార్టీ అధిష్టానం లక్ష్మణ్‌కు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశిస్తున్న నాయకుల కోరిక నెరవేరుతుందా లేదా అని కార్యకర్తలు పేర్కొంటున్నారు. ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమంతో క్యాంపు కార్యాలయం కార్యకర్తలతో కళకళలాడేది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవిని వేరొకరికి అధిష్టానం నియమించిందని వార్తలు వెలువడడంతో లక్ష్మణ్‌ క్యాంపు కార్యాలయం కార్యకర్తల సందడి లేక బోసిపోయింది. 2018లో జరిగిన ఎన్నికల్లో లక్ష్మణ్‌ ఓటమి పాలు చెందినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మళ్లీ రెండోసారి కూడా లక్ష్మణ్‌ అధ్యక్షుడుగా కొనసాగుతారని విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ముషీరాబాద్‌లోని కమలనాథులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Updated Date - 2020-03-12T14:36:42+05:30 IST