కేంద్ర నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-06-11T18:08:56+05:30 IST

ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యాక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు.

కేంద్ర నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు: బండి సంజయ్

ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యాక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. మోదీ ఏడాది పాలనలో తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికీ వెళ్ళి వివరిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్భాటాలకు పోకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 


దేశ వ్యాప్తంగా 10కోట్ల కుటుంబాలను.. తెలంగాణలో 30లక్షల కుటుంబాలను కలవాలని జాతీయ నాయకత్వం ఆదేశించిందని సంజయ్ తెలిపారు. మోదీ ఏడాది పాలనలో ఆర్టికల్ 370రద్దు, సీఏఏ లాంటి సాహసోపేతమైన చట్టాలను తీసుకొచ్చారని కొనియాడారు. మోదీ చొరవతోనే దేశంలో కరోనాను కట్టడి చేయగల్గుతున్నామన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు దేశంలో విధ్వంసం జరగాలని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. 


కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని సంజయ్ విమర్శించారు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. కరోనా టెస్టులను చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవటం బాధాకరమన్నారు. డాక్టర్లు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు.

Updated Date - 2020-06-11T18:08:56+05:30 IST