ఆ దమ్ము సీఎం కేసీఆర్‌కు ఉందా?: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-04-24T19:17:40+05:30 IST

రైతు సమస్యల పరిష్కారానికి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ..

ఆ దమ్ము సీఎం కేసీఆర్‌కు ఉందా?: బండి సంజయ్

కరీంనగర్: రైతు సమస్యల పరిష్కారానికి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతుల్లో భరోసా నింపేందుకే దీక్ష చేపట్టానని అన్నారు. పంటకొనుగోళ్లు లేకపోవడంతోనే రైతులు ఆందోళనకు దిగారని అన్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పాతబస్తీలో లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేసే దమ్మ కేసీఆర్‌కు ఉందా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు.


రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. అలాగే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉపవాసదీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటామనే స్థాయికి వచ్చారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించకుండా తిరిగి వారిపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలు గుర్తించి.. పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా బీజేపీ ఉంటుందని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. రైతులకు సంఘీభావంగా ఇవాళ ఉపవాసదీక్ష చేపట్టినట్లు బండి సంజయ్ చెప్పారు.

Updated Date - 2020-04-24T19:17:40+05:30 IST