మరోసారి దగాకు కేసీఆర్‌ యత్నం

ABN , First Publish Date - 2020-12-30T08:17:42+05:30 IST

రెండేళ్లలో పీఆర్సీ చేయని పనిని సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తుందో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈనెల 31తో కమిషన్‌ పదవీకాలం ముగుస్తుందని తెలిసి కూడా రిపోర్టు ఇవ్వకపోవడం అంటే ఉద్యోగులను మోసం చేయడమేనన్నారు.

మరోసారి దగాకు కేసీఆర్‌ యత్నం

ఉద్యోగులు, నిరుద్యోగులకు న్యాయం 

జరిగేదాకా పోరాటం: బండి సంజయ్‌ 

నష్టం వస్తే నిర్బంధ సాగు ఎందుకు చేయుంచారు?: డీకే అరుణ


హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో పీఆర్సీ   చేయని పనిని సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తుందో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈనెల 31తో కమిషన్‌ పదవీకాలం ముగుస్తుందని తెలిసి కూడా రిపోర్టు ఇవ్వకపోవడం అంటే ఉద్యోగులను మోసం చేయడమేనన్నారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం.. ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన బహురూపుల వేషాలను ఎవరూ నమ్మరని అన్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్‌ వస్తుంది కాబట్టి పీఆర్సీకి మరికొంత సమయం తీసుకునేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే వరకు, నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు కేసీఆర్‌ను నిద్రపోనివ్వబోమని సంజయ్‌ ఒక ప్రకటనలో తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్‌ 15 రోజులు ఫాంహౌ్‌సలో ఉంటే సోయి వచ్చి, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం తప్పు అని తెలుసుకున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలతో రూ.7,500 కోట్ల నష్టం అంటూ సీఎం పచ్చి అబద్ధం చెప్పారని.. నష్టం వస్తే నిర్బంధ సాగు ఎందుకు చేయించారని నిలదీశారు. రైతు వేదికల్లో కేంద్రం వాటా కూడా ఉందని, వాటిని కొనుగోలు కేంద్రాలుగా వినియోగించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 


పార్టీ వ్యతిరేకులపై అధిష్ఠానం ఆరా

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారితో పాటు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకుల వివరాలను బీజేపీ జాతీయ నాయకత్వం సేకరించింది. ఇక, రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలు, ముఖ్యం గా పట్టణ ప్రాంతాలపై దృష్టి పెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని భవిష్యత్తులో మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తేలేదని రాష్ట్ర పార్టీ ముఖ్యులు స్పష్టం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా, మహబూబ్‌నగర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్‌ వైఖరిపై పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.


ఉద్యోగాల భర్తీ కోసం బీజేవైఎం ఆందోళన

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రహదారులను దిగ్బంధం చేశారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి రెండేళ్లు దాటిందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ అన్నారు. 


మానవత్వాన్ని చాటిన సంజయ్‌ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం జహీరాబాద్‌ వెళ్తున్న సమయంలో చందానగర్‌ వద్ద ఓ మహిళ ఫిట్స్‌ వచ్చి రోడ్డుపై పడిపోవడాన్ని గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి, ఆమెను పరామర్శించారు. మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు కొంత ఆర్థిక సాయం చేశారు. తక్షణం ఆమెను ఆస్పత్రికి తరలించాలని పార్టీ నాయకులకు సూచించారు.

Updated Date - 2020-12-30T08:17:42+05:30 IST