కేసీఆర్‌ కళ్లు తెరిచారు..సంతోషం

ABN , First Publish Date - 2020-12-28T07:43:59+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్‌ కళ్లు తెరిచినందుకు సంతోషం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ కళ్లు తెరిచారు..సంతోషం

తుగ్లక్‌ పాలన ఎలా ఉంటుందో చూపించారు

కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాలేడు: బండి సంజయ్‌


హైదరాబాద్‌/పెద్దపల్లి/నర్సాపూర్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నూతన వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్‌ కళ్లు తెరిచినందుకు సంతోషం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ‘‘నూతన వ్యవసాయ చట్టాలపై గతంలో విమర్శలు చేసిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు కితాబు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సంకేతాలు ఇవ్వడం సంతోషం’’ అని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తుగ్లక్‌ పాలన ఎలా ఉంటుందో కేసీఆర్‌ అనుభవంతో ప్రజలకు చూపించారని విమర్శించారు. కేసీఆర్‌ నియంతృత్వ ఆలోచన ద్వారానే నియంత్రిత సాగు తప్పనిసరి చేశారని మండిపడ్డారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించినందుకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నామని చెప్పి.. రైతులకు లాభం చేకూర్చే విషయంలో బాధ్యతల నుంచి తప్పుకొంటే ఊరుకోబోమని హెచ్చరించారు. కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాలేడని, ఆయనకు ఎంపీ సంతో్‌షకుమార్‌కు మధ్య కొట్లాట పెట్టి కేసీఆరే సీఎంగా కొనసాగుతారని  బండి సంజయ్‌ అన్నారు. 


తనకు అహంకారం పెరిగిందని కొందరు అంటున్నారని, అలాంటిదేమీ లేదని, భాషలో తనకు కేసీఆర్‌ గురువు అని, గురుదక్షిణగా ఆయన భాషలోనే మాట్లాడుతున్నానని బండి సంజయ్‌ చెప్పారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి, సుల్తానాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి విగ్రహాలను   ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఢిల్లీకి పోయి కత్తి తిప్పుతానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్‌ ఫాంహౌ్‌సకే పరిమితం అయ్యారని విమర్శించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాలు వేస్తారని, మరి మందు తాగి ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్‌ చేసేది తప్పు కాదా అని ప్రశ్నించారు.


సీఎం తలతిక్క నిర్ణయంతో నష్టం: విజయశాంతి

నియంత్రిత సాగు పేరిట సీఎం కేసీఆర్‌ తలతిక్క నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ఎన్నో వైఫల్యాల తుగ్లక్‌ పాలనలో ఇది మరోటి అని విమర్శించారు. రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఇప్పుడు పేర్కొంటూ, మొన్న రాష్ట్ర బంద్‌ ఎందుకు నిర్వహించారని నిలదీశారు. తనకు విదేశాల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నాయని కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు  పోస్టింగ్‌లు పెడుతున్నారని, దమ్ముంటే తన ఆస్తులపై, సీఎం కేసీఆర్‌ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి డిమాండ్‌ చేశారు.


కేసీఆర్‌ మాటలకు.. చేతలకు పొంతన ఉండదని శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆయన మాట్లాడారు. దళిత బిడ్డలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడంలేదని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను ఎందుకు భర్తీ చేయడంలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీకుమారి ప్రశ్నించారు. దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సోమవారం అన్ని తహశీల్దార్‌ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తామని దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా తెలిపారు. మైనారిటీలను ఓట్ల కోసం వాడుకున్న సీఎం కేసీఆర్‌.. మోసం చేశారని మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ అఫ్సర్‌ పాషా ఆరోపించారు.

Updated Date - 2020-12-28T07:43:59+05:30 IST