బండారు దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2020-12-15T07:37:26+05:30 IST
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో కారు ప్రమాదం తప్పింది. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం శివారు జాతీయ రహదారిపై సోమవారం
రోడ్డు పక్కకు దూసుకెళ్లిన గవర్నర్ బెంజి కారు
హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళ్తుండగా ఘటన
చౌటుప్పల్ రూరల్/హైదరాబాద్, డిసెంబరు 14: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో కారు ప్రమాదం తప్పింది. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం శివారు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండలో పౌరసన్మానం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా.. దత్తాత్రేయ ప్రయాణిస్తున్న బెంజి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని రోడ్డు కిందికి దూసుకుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా నిలిపివేయడంతో కారు పల్టీలు కొట్టకుండా ఆగిపోయింది.
ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా, సీటు బెల్ట్ ధరించటంతో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతరం మరో వాహనంలో ఆయన నల్లగొండ వెళ్లారు. కారు స్టీరింగ్ ఒక్కసారిగా బిగుసుకుపోవడంతో వాహనం అదుపు తప్పిందని డ్రైవర్ మురళి పోలీసులకు వివరించాడు. అయితే, కారు అదుపు తప్పడానికి డ్రైవరే కారణమని ఆర్టీఏ అధికారి ఇమ్రాన్ అహ్మద్ ప్రాథమిక విచారణలో తేల్చారు.
కాగా, దత్తాత్రేయను రాష్ట్రపతి కోవింద్, కేంద్ర మంత్రి అమిత్‌షా ఫోన్‌లో పరామర్శించారు. తెలంగాణ, ఏపీ గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హిమాచల్ సీఎం జైరాంఠాకూర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కె.లక్ష్మణ్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ప్రమాదంపై ఆరా తీశారు.