వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2020-12-12T04:12:18+05:30 IST

వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం
వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎంపీపీ

ఎంపీటీసీలు, సర్పంచ్‌ల మధ్య తీవ్ర వాగ్వివాదం

వ్యవసాయ అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం


బచ్చన్నపేట, డిసెంబరు 11: బచ్చన్నపేట మండల సర్వసభ్య సమావేశం గతంలో ఎన్నడూ లేనివిధంగా శుక్రవారం వాడివేడిగా సాగింది. ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే గ్రామాభివృద్ధి విషయంలో ఎంపీటీసీలకు సర్పంచ్‌లకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఎంపీటీసీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీ్‌షరెడ్డి ఆరోపించారు. ఎన్నికైన దగ్గరి నుంచి వారు ఏం పనులు చేశారో చూపాలన్నారు. తీర్మానాల ఆధారంగా చేసిన పనులకు ఎంబీ రికార్డులు చేస్తే ఎంపీటీసీలకు వచ్చిన అభ్యంతరం ఏంటో తెలుపాలన్నారు. అంతకు ముందు వైస్‌ ఎంపీపీ అనిల్‌రెడ్డి మాట్లాడుతూ ఎంబీ రికార్డుల్లో తప్పులు ఉన్నాయని చెబితే అధికారులు పట్టించుకోకుండా క్లియర్‌ చేశారని ఆరోపించారు. గ్రామాల్లో 10 ట్రిప్పుల మొరం పోసి నలభై ట్రిప్పులు రాసుకుంటే దాన్ని ప్రశ్నిస్తే తప్పు పట్టడం సరైంది కాదని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దూడల కనకయ్యగౌడ్‌ ఆరోపించారు. ఎంపీటీసీలను చులకనభావంతో చూడటం తగదన్నారు. 


వ్యవసాయాధికారుల నిర్లక్ష్యంతో అన్యాయం..

వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం మూలంగా తమకు రావాల్సిన రైతుబీమా ఆగిపోయిందని చిన్నరామన్‌చర్ల గ్రామానికి చెందిన మరికుక్కల కవిత ఆరోపించారు. తన భర్త మరికుక్కల సిద్దులు పేరిట పట్టాదారు పాసుపుస్తకం జనవరిలో వచ్చిందని, ఆగస్టు 12న రైతుబీమా కోసం వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏఈవో శ్రావణికి దరఖాస్తు అందజేశామని అన్నారు. సెప్టెంబర్‌ 21న సిద్ధులు చనిపోయాడని, రైతుబీమా కోసం అధికారులను కలిస్తే మీ భర్తకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్‌ చేశారు. తన భర్త ఫొటోతో సభలోకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృిష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని మండల ప్రజాప్రతినిధులు ఏవోకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:12:18+05:30 IST