కుక్కకాటుతో కోమాలోకి చిన్నారి!

ABN , First Publish Date - 2020-08-01T07:40:11+05:30 IST

కుక్కకాటుతో కోమాలోకి చిన్నారి!

కుక్కకాటుతో కోమాలోకి చిన్నారి!

నిర్మల్‌, జూలై 31 ( ఆంధ్రజ్యోతి ): ఇంటి ముందు ఆడుంటున్న చిన్నారికి కుక్క కరిచి.. తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లిపోయింది! రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద తల్లిదండ్రులు.. పాప చికిత్స కోసం ఇప్పటికే రూ.2లక్షలు ఖర్చుచేశారు. అయినా పాప ఇంకా కోమాల్లోనే ఉందని.. వైద్యానికి మరో రూ.4 లక్షలు అవసరమని వైద్యులు చెబుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దాతలే ఆదుకొని పాపను బతికించాలని వేడుకుంటున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన బోదాసు శ్రీనివాస్‌, జయ దంపతులకు లయ (7) ఏకైక సంతానం. రెండు నెలల క్రితం పాపకు కుక్క కరిచింది. చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచన మేరకు  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందిస్తుండగానే పాప కోమాలోకి వెళ్లింది. అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా చికిత్సకు రూ.2లక్షల దాకా ఖర్చయింది తప్ప పాప కోమాలోంచి బయటకు రాలేదు. చికిత్స కోసం మరో రూ.4లక్షలు అవసరపడతాయని  వైద్యులు చెప్పడంతో అంత డబ్బు ఇచ్చుకోలేక పాపను అదే స్థితిలో ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం పాప కోమాలోనే ఉంది. పాప పరిస్థితిని చూసి తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పాపకు వైద్యం అందించేందుకు దాతలు సాయం చేయాలని కోరుతున్నారు. సహాయం చేయదలచిన వారు 7671996233, 9010375607 నంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు. గ్రామానికి చెందిన యువకులు తలా ఇన్ని డబ్బులు పోగేసి రూ.11 వేలు సాయం చేశారు.

Updated Date - 2020-08-01T07:40:11+05:30 IST