బీ ఫామ్‌ లొల్లి

ABN , First Publish Date - 2020-11-23T08:26:44+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గ పరిధి గన్‌ఫౌండ్రీ డివిజన్‌ టిక్కెట్‌ కేటాయింపు బీజేపీలో కలకలం రేపింది. టిక్కెట్‌ ఆశించి భంగపడిన

బీ ఫామ్‌ లొల్లి

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  కార్యకర్తల ఆందోళన

టిక్కెట్‌ దక్కిన అభ్యర్థి భర్తపై దాడికి యత్నం

ఇరు వర్గాల మధ్య తోపులాట.. చిరిగిన చొక్కాలు

నా కార్యకర్తలకు టికెట్‌ ఇప్పించుకోలేకపోయా..

సంజయ్‌పై అధిష్ఠానానికి  లేఖ రాస్తా: రాజాసింగ్‌

మంగళ్‌హాట్‌/అఫ్జల్‌గంజ్‌, నవంబర్‌ 22(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గ పరిధి గన్‌ఫౌండ్రీ డివిజన్‌ టిక్కెట్‌ కేటాయింపు బీజేపీలో కలకలం రేపింది. టిక్కెట్‌ ఆశించి భంగపడిన నాయకుడి అనుచరులు, బీఫామ్‌ దక్కిన అభ్యర్థి భర్తపైకి దూసుకెళ్లారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురి చొక్కాలు చిరిగాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన ఘటన వివరాలు.. గన్‌ఫౌండ్రీ డివిజన్‌ టిక్కెట్‌ కోసం బీజేపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఉపాధ్యక్షుడు శైలేందర్‌ యాదవ్‌, ఓం ప్రకాష్‌ భీష్వ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎవరికీ కేటాయించకుండా నాయకత్వం మూడు రోజులు వేచి చూసింది.


ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగస్తుండగా ఓం ప్రకాష్‌ భీష్వ సతీమణి డాక్టర్‌ బి.సురేఖకు బీ ఫామ్‌ ఇచ్చారు. దీంతో శైలేందర్‌ యాదవ్‌, అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం ప్రకాష్‌పై దాడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి అదుపు చేశారు. ఈ ఘటన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇటీవల టీడీపీ నుంచి వచ్చినవారికి టిక్కెట్‌ ఎలా కేటాయిస్తారని శైలేంద్ర మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో చేరుతానని ప్రకటించారు. శైలేంద్రకు గత ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో టిక్కెట్‌ చేజారింది. 



బండి సంజయ్‌ నన్ను మోసం చేశారు: రాజాసింగ్‌

ఈ పరిణామాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తనవారికి టిక్కెట్లు కేటాయించకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ మోసం చేశారంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆడియో విడుదల చేశారు. ‘రెండు, మూడు రోజుల తరువాత అధిష్ఠానానికి లేఖ రాస్తా. ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు ఎలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారో తెలియజేస్తా.

150 డివిజన్లలో ఎక్కడా జోక్యం చేసుకోను. నా నియోజకవర్గంలో మాత్రం నాకు వదిలేయమని విజ్ఞప్తి చేశా. అయినప్పటికీ నా అనుచరులెవరికీ టిక్కెట్లు ఇవ్వలేదు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి నేను ఒక్కడినే గెలిచా. అది కార్యకర్తల వల్లనే. వారికే టిక్కెట్‌ ఇప్పించలేకపోయా’ అని పేర్కొన్నారు.


Updated Date - 2020-11-23T08:26:44+05:30 IST