‘కట్టుడు ప్రాంతం’లో కూల్చివేతలు షురూ!

ABN , First Publish Date - 2020-06-16T10:54:12+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలపై ఎట్టకేలకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. గురుకుల్‌ ట్రస్ట్‌లోని అయ్యప్ప సొసైటీలో

‘కట్టుడు ప్రాంతం’లో కూల్చివేతలు షురూ!

  • అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కదిలిన యంత్రాంగం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

లాక్‌డౌన్‌ వేళ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలపై ఎట్టకేలకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. గురుకుల్‌ ట్రస్ట్‌లోని అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘‘ఇది ‘కట్టుడు’ ప్రాంతం’’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణాల దందాలో కొందరు పెద్దల హస్తాలు కూడా ఉండడంతో ఈ కథనం సంచలనం సృష్టించింది. దీనిపై జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం ఉదయం అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. ఆగమేఘాలపై కూల్చివేత పనులు చేపట్టారు. రెండు పెద్ద భవనాల నిర్మాణాలను కూల్చివేశారు. మరో 24 భవన నిర్మాణాలను నిలిపివేసి అక్కడి నిర్మాణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో కొత్తగా నిర్మించిన దాదాపు 40 భవనాలను గుర్తించారు.


ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసు బలగాలను కూడా అడిగామని చందానగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాంష్‌ చెప్పారు. కొత్తగా ఈ ప్రాంతంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలన్నింటిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనం రెవెన్యూవర్గాల్లోనూ కలకలం రేకెత్తించింది. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో చంద్రకళ శేరిలింగంపల్లి తహసీల్దారును ఆదేశించారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామంటున్న అధికారులు సాధారణ వ్యక్తుల భవనాలనే టార్గెట్‌ చేస్తారా? లేక పెద్దల భవనాలనూ కూల్చుతారా? అనేది వేచి చూడాల్సిందే. అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణాలపై కథనాలు వచ్చినప్పుడల్లా సామాన్యుల భవనాలనే కూలుస్తున్నారు. బడాబాబుల పెద్ద భవనాలను మాత్రం వదిలేస్తున్నారు. 


ప్రైవేటు ఉద్యోగిదే హవా

శేరిలింగంపల్లి డివిజన్‌లో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి అక్రమ నిర్మాణాల వ్యవహారంలో చక్రం తిప్పుతున్నాడు. దాదాపు కొన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న ఆ ఉద్యోగి కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ అమాత్యుని వద్ద పనిచేసే అధికారి ఆశీస్సులు ఇతనికి ఉండడంతో బహిరంగంగానే వసూళ్లకు దిగుతున్నాడు. పెద్దల ఆశీస్సులు ఉండడంతో ఈ ఉద్యోగి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలు జరిగే భవనాల వద్దకు వెళ్లి చిన్న చిన్న రంధ్రాలు పెట్టి, తర్వాత సెటిల్‌మెంట్‌ చేసే స్కీమ్‌లో ఇతనే సూత్రధారి.  ఇక్కడ నిర్మాణాలే కాదు.. కరెంట్‌ కనెక్షన్లు, నల్లా కనెక్షన్లూ అన్నీ అక్రమమే. గతంలో ఒకరిద్దరు కోర్టు నుంచి తీసుకున్న ఆర్డర్‌ కాపీలు చూపించి మిగతా వారు వాటర్‌, కరెంట్‌ కనెక్షన్లు తీసుకుంటున్నారు. వీటిలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. 


సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

గురుకుల్‌ ట్రస్ట్‌కు చెందిన భూముల వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. 2018 ఆగస్టు 28న విచారణ చేపట్టిన కోర్టు.. గురుకుల్‌ భూములపై ఉన్న అన్ని స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నామంది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన స్టే ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దాని ప్రకారం ఈ భూములపై యథాతథ స్థితిని కొనసాగించాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలనూ గాలికి వదిలేశారు.

Updated Date - 2020-06-16T10:54:12+05:30 IST