కరోనాకు ఇస్తున్న వైద్యం సత్ఫలితాలు ఇస్తోంది- డా. కొండల్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-05-14T01:19:00+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాధి గ్రస్తులకు ఇస్తున్న వైద్యం సత్ఫలితాలను ఇస్తోందని ఉస్మానియా హాస్పిటల్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కొండల్‌రెడ్డి తెలిపారు.

కరోనాకు ఇస్తున్న వైద్యం సత్ఫలితాలు ఇస్తోంది- డా. కొండల్‌రెడ్డి

హైదరాబాద్‌:  రాష్ట్రంలో కరోనా వ్యాధి గ్రస్తులకు ఇస్తున్న వైద్యం సత్ఫలితాలను ఇస్తోందని ఉస్మానియా హాస్పిటల్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కొండల్‌రెడ్డి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో కరోనా వ్యాధికి చికిత్సలు జరుగుతున్నాయన్నారు. పూర్తిస్థాయిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మాధెరపీ కూడా ప్రారంభమైందన్నారు. కరోనా వైరస్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార, పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పలువురు వైద్యనిపుణులు మాట్లాడారు. ఈసందర్భంగా డాక్టర్‌ కొండల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఆస్పత్రులలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్‌లను ధరించడం తప్పని సరి అన్నారు. చేతులను విధిగా 40 సెకన్లపాటు కడుక్కోవడం అలవర్చుకోవాలన్నారు.


 ఒక వ్యక్తి మాస్క్‌ను ధరించి, మాస్క్‌ను ధరించని వ్యక్తికి దగ్గరగా వెళితే వైరస్‌ సోకే అవకాశం ఉంటుందన్నారు. జ్వరము, దగ్గు, ఆయాసం లాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ సలహాలు, సూచనలు తప్పక తీసుకోవాలని సూచించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను వైద్యుల సలహా మేరకూ తీసుకోవాలని చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసాక కూడా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు బౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్‌ సి, డి, జింక్‌, ప్రోటీన్స్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. వీటితో పాటు విధిగా కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలని అన్నారు. 


అపోలో హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ పల్మొనాలజిస్ట్‌ డాక్టర్‌ దివ్యేష్‌ వాఘ్రె మాట్లాడుతూ కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 40లక్షలు కాగా, రాష్ట్రంలో 1300 కేసులు చేరువలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల సహకారంతో వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. ఆర్ధిక లావాదేవీలు పంజుకోవడం కోసం లాక్‌డౌన్‌ను ప్రభుత్వం దశల వారీగా ఎత్తివస్తే అప్పుడు   కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గుండె, ఊపిరి తిత్తులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరంగా బయటికి వెళ్లవసి వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రపంచ వవ్యాప్తంగా వైరస్‌ను నిరోధించడానికి వ్యాక్సీన్‌ తయారీకి క్లినికల్‌ట్రయల్స్‌ దశలో ఉందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య కాంబ్లే, జాయింట్‌ డైరెక్టర్‌ జగన్‌, సీఇఈ విజయభాస్కర్‌రెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ యామిని తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-14T01:19:00+05:30 IST