బసవతారకం ఆస్పత్రికి అవార్డులు

ABN , First Publish Date - 2020-12-06T08:08:35+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో రోగులకు నిరంతరం సేవలందించినందుకు బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి, డాక్టర్ల బృందానికి ప్రత్యేక అవార్డులు దక్కాయి.

బసవతారకం ఆస్పత్రికి అవార్డులు

తెలంగాణ హెల్త్‌ కేర్‌ లీడర్‌షిప్‌, కొవిడ్‌ వారియర్‌ పురస్కారాల ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో రోగులకు నిరంతరం సేవలందించినందుకు బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి, డాక్టర్ల బృందానికి ప్రత్యేక అవార్డులు దక్కాయి.  ప్రత్యేక కార్యాచరణ బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్‌ ఆర్‌వీ ప్రభాకర్‌ సేవలను గుర్తించిన వరల్డ్‌ హెల్త్‌, వెల్‌నెస్‌ కాంగ్రెస్‌.. తెలంగాణ హెల్త్‌కేర్‌ లీడర్‌షిప్‌ అవార్డుకు తమ ఆస్పత్రిని ఎంపిక చేసిందని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి చైర్మన్‌, ఎండీ నందమూరి బాలకృష్ణ తెలిపారు.


ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే ఢిల్లీకి చెందిన టాప్‌ గాలెంట్‌ మీడియా, రిసర్చ్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు దేశవ్యాప్తంగా కొవిడ్‌పై వినూత్న పోరాటం చేసిన వారికి అందించే ప్రత్యేక కొవిడ్‌ వారియర్‌ అవార్డును డాక్టర్‌ ప్రభాకర్‌తో పాటు బసవతారకం ఆస్పత్రికి కూడా ఇచ్చాయని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పఘన్‌సింగ్‌ కులస్తే ఈ అవార్డులను అందించారని వెల్లడించారు.

వీక్‌ మేగజీన్‌ ప్రకటించిన ర్యాంకుల్లోనూ బసవతారకం ఆస్పత్రి ఆరో స్థానంలో నిలిచిందని చెప్పారు. కొవిడ్‌ను సైతం లెక్కచేయకుండా నిరంతరం సేవలందించిన వైద్యులు, సిబ్బంది సేవలకు దక్కిన గుర్తింపే ఈ పురస్కారాలని బాలకృష్ణ పేర్కొన్నారు. 


భవిష్యత్తులోనూ ఇలాగే సేవలందిస్తాం: బాలకృష్ణ

భవిష్యత్తులో కూడా పేద రోగులకు సేవలందిస్తామని బాలకృష్ణ తెలిపారు. గోదావరిఖనికి చెందిన దాసరి శివాజీ అనాథ. అతడు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. డాక్టర్‌ టీఎస్‌ రావు, డాక్టర్‌ పట్నాయక్‌ల వైద్య బృందం శివాజీకి ఉచితంగా శస్త్రచికిత్స చేసింది. అతను పూర్తిగా కోలుకునే వరకు వైద్యులు శ్రద్ధ వహించారు. ఈ సందర్భంగా శివాజీకి విజయవంతంగా చికిత్సను అందించిన వైద్యులు, సిబ్బంది కృషిని బాలకృష్ణ అభినందించారు. 


Read more