‘సహకార’ పదవుల వేలం

ABN , First Publish Date - 2020-02-08T09:55:54+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలో సహకార సంఘాల పదవులకు వేలం పాటలు జోరుగా కొనసాగుతున్నాయి. చైర్మన్‌ పదవులు రూ.25 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. అధికారులు

‘సహకార’ పదవుల వేలం

25.05 లక్షలు పలికిన శెట్‌పల్లి చైర్మన్‌ పదవి

పడిగెల చైర్మన్‌ పదవికి రూ.23.60 లక్షల ధర

నిజామాబాద్‌ జిల్లాలో అధికార పార్టీ నేతల పోటీ

చర్యలు తీసుకోవడానికి జంకుతున్న అధికారులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7: నిజామాబాద్‌ జిల్లాలో సహకార సంఘాల పదవులకు వేలం పాటలు జోరుగా కొనసాగుతున్నాయి. చైర్మన్‌ పదవులు రూ.25 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. అధికారులు చూసీచూడనట్టు ఉండటంతో ఒక గ్రామాన్ని చూసి మరో గ్రామంలో వేలానికి తెరలేస్తోంది. శుక్రవారం పలుచోట్ల వేలం పాటలు నిర్వహించారు. ఇప్పటికే ఆర్మూర్‌ మండలం పిప్రి సొసైటీ చైర్మన్‌ పదవిని వేలం వేయగా.. తాజాగా వేల్పూర్‌ మండలం పడిగెల, కమ్మర్‌పల్లి మండలం కోనాసముందర్‌, మోర్తాడ్‌ మండలం శెట్‌పల్లి సంఘాల చైర్మన్‌ పదవులకు వేలం జరిగింది. కొన్ని గ్రామాల్లో డైరెక్టర్‌ పదవులను కూడా వేలం వేస్తున్నారు. మోర్తాడ్‌ మండలం శెట్‌పల్లి సొసైటీ చైర్మన్‌ పదవి అత్యధికంగా రూ.25.05 లక్షలు పలికింది. పడిగెల చైర్మన్‌ పదవి రూ.23.60 లక్షలు పలికింది. పడిగెల సొసైటీ పరిధిలోని కోమన్‌పల్లిలో టీసీ పదవి రూ.6.30 లక్షలు పలికింది. వైస్‌ చైర్మన్‌ పదవి వచ్చే అవకాశం ఉండడంతో ఈ టీసీకి డిమాండ్‌ ఏర్పడింది. కోనాసముందర్‌ చైర్మన్‌ పదవి రూ.10 లక్షలు పలికింది. ప్రస్తుత వైస్‌ చైర్మనే వేలంలో దక్కించుకున్నారు. వేలంలో పదవులను పాడుకున్న వారు సొంత డబ్బులు చెల్లించాలి. 


70 లక్షలు మంజూరు చేయిస్తానని ఒప్పందం!

సహకార ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభావం కనిపించడం లేదు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల మధ్యే పోటీ ఉంది. పదవి దక్కించుకోడానికి వారు వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. పిప్రి గ్రామంలో అధికార పార్టీ నాయకుడు రూ.70 లక్షలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని ఒప్పందం చేసుకున్నారు. మిగతా గ్రామాల్లోనూ టీఆర్‌ఎస్‌ నాయకులే వేలంలో పాల్గొన్నారు. దీనిపై పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో స్థానిక సంస్థల పదవులకు వేలం వేస్తే ఎన్నిక వాయిదా వేశారు. వేలం వేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ సారి మాత్రం చర్యలు తీసుకోడానికి అధికారులు భయపడుతున్నారు.

Updated Date - 2020-02-08T09:55:54+05:30 IST