అమరవీరుల స్థూపం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-01T11:35:42+05:30 IST

‘నా చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారకుడు అంటూ’ ఓ వ్యక్తి లేఖ రాసిపెట్టి హన్మకొండ అదాలత్‌ జంక్షన్‌

అమరవీరుల స్థూపం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నర్సంపేట ఎమ్మెల్యే ‘పెద్ది’ కారణమంటూ లేఖ


హన్మకొండ రూరల్‌/నెక్కొండ, జూన్‌ 30: ‘నా చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారకుడు అంటూ’ ఓ వ్యక్తి లేఖ రాసిపెట్టి హన్మకొండ అదాలత్‌ జంక్షన్‌ వద్ద కత్తితో గొంతు కోసుకున్నాడు. పోలీసులు వెంటనే ఎంజీఎంకు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించి  సుబేదారి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట్‌ గ్రామానికి చెందిన మాసం వెంకటేశ్వర్లు రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్‌గా ఉన్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని ఆర్థికంగా నష్టపోయాడు. కేసుల్లో జైలుకు సైతం వెళ్లాడు.


ఇంతచేసినా టీఆర్‌ఎస్‌ పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన చెందేవాడు. కాగా, నర్సంపేటలోని ఓడీసీఎంఎస్‌ కార్యాలయంలో సూపర్‌వైజర్‌గా  పనిచేస్తున్న తన కుమారుడు రామ్‌రాజ్‌ను ఇటీవల పాలకవర్గం అకారణంగా తొలగించింది. ఈ విషయమై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పది రోజుల క్రితం కలిసి ఉద్యోగం ఇప్పించాలని కోరాడు.


అయినా ఫలితం లేకపోవడంతో ఈనెల 26న అలంకానిపేటలో సీసీరోడ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను మరోసారి కలవడానికి ప్రయత్నించగా నాయకులు అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది మంగళవారం హన్మకొండలో సూసైడ్‌నోట్‌ రాసి గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఎంజీఎంకు తరలించిన సుబేదారి పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కాగా ఆ లేఖలో ‘‘నా చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణం.  కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో పెద్దికి ఎమ్మెల్యేగా టికెట్‌ ఇవ్వవద్దు.. ఎమ్మెల్యేగా అన్‌ఫిట్‌’’ అంటూ లేఖలో రాశారు. 

Updated Date - 2020-07-01T11:35:42+05:30 IST