దేశవ్యాప్తంగా దళితులపై దాడులు
ABN , First Publish Date - 2020-10-08T08:30:38+05:30 IST
దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు వినాల్సి రావడం శోచనీయమని ముఖ్యమంత్రి కేసీఆర్

ఇలాంటి ఘటనలు శోచనీయం
ఈ దుస్థితి నుంచి సమాజం బయటపడాలి
దాడి జరగకముందే స్పందించి అరికట్టాలి
శాంతి భద్రతల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం
మహిళా భద్రతకు మరింతగా శ్రమించాలి
అటవీ, పోలీస్ శాఖలు కలిసి పని చేయాలి
త్వరలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్: కేసీఆర్
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు వినాల్సి రావడం శోచనీయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ దుస్థితి నుంచి సమాజం బయటపడాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తతతో మెలగాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో బుధవారం పోలీస్, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలహీనులపై బలవంతుల దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు వ్యవస్థదేనని చెప్పారు.
రక్షణ కోసం వచ్చిన అభాగ్యుల పట్ల మానవీయ దృక్పథంతో మెలగాలని సూచించారు. ప్రతి పోలీసూ స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీసుల భాగస్వామ్యాన్ని ఆయన అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతను ప్రాధాన్య అంశంగా తీసుకొని పని చేస్తోందని చెప్పారు. పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతంగా శ్రమించాలని అన్నారు. సమాజాన్ని పీడించే గంజాయి వంటి మాదక ద్రవ్యాల ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను అరికట్టాలని పిలుపునిచ్చారు. వ్యవస్థీకృత నేరాల మీద ఉక్కుపాదం మోపాలన్నారు.
కలప స్మగ్లర్లపై కఠినంగా..
అటవీ సంపదను కొల్లగొట్టే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కలప స్మగ్లింగ్‌ను గత పాలకులు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్లే కొందరికి అలుసుగా మారిందన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టడంలో అటవీ శాఖ అధికారులే కాక.. సివిల్ పోలీస్ వ్యవస్థ కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు.
గుడుంబాను అరికట్టండి
‘‘కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడాగుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారం ఉంది. దానిని పూర్తి స్థాయిలో తక్షణమే అరికట్టాలి. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజ్, పోలీస్ శాఖలు తిరిగి అదే స్పూర్తితో పనిచేయాలి’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్యాంబ్లింగ్ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ ధ్రువపత్రాల తయారీపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి, అరికట్టాలని అన్నారు. నకిలీ రఽధువపత్రాలు సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.
కారుణ్య నియామకాల్లో ఆలస్యం వద్దు!
పోలీసు శాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదని సీఎం కేసీఆర్ అన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి వారసులకు తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. ఖాళీలను పరిశీలించి.. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలని డీజీపీని ఆదేశించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ సెటిల్ చేసి.. సర్వీస్ ఆఖరి రోజున సత్కరించి.. గౌరవప్రదంగా ఇంటిదాకా కారులో పంపే సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. ‘‘33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తున్న నేపథ్యంలో.. ఆ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మహిళ సిబ్బంది విధులు నిర్వహించే పోలీస్ కార్యాలయాలు, స్థలాల్లో ప్రత్యేకంగా రెస్ట్ రూంలతో పాటు ఇతర వసతులు కల్పించాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.