సివిల్‌సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-10-03T11:05:31+05:30 IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల కోసం అధికారులు ..

సివిల్‌సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు

 వరంగల్‌లో 16 పరీక్ష కేంద్రాల్లో 6,763 మంది అభ్యర్థులు 

ఒకరోజుముందు కేంద్రాల్లో శానిటైజేషన్‌  

కొవిడ్‌ లక్షణాలున్నవారికి ప్రత్యేక గదులు 


వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 2: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 4న జరగనున్న పరీక్షలకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో 16 సెంటర్లు ఏర్పాటుచేయగా 6,763 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు, రెవెన్యూశాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలను కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు అప్రమత్తం చేశారు. కరోనా నేపథ్యంలో అభ్యర్థుల మధ్య దూరం కనీసం మూడు ఫీట్లు ఉండేలా సీటింగ్‌ అరెంజ్‌మెంట్‌ చేశారు. పరీక్షకు ఒక రోజు ముందు కేంద్రాల్లో శానిటైజషన్‌ చేయనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఐనప్పటికీ 15శాతం మాస్కులు, గ్లౌజులు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.


పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్‌ ఏర్పాటు చేయాలని, కేంద్రంలో కూడా శానిటైజర్‌ను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నందున వారి సామగ్రిని భద్రపరిచేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రంలోకి 10నిమిషాల ముందు అభ్యర్థులను అనుమతిస్తారు, ఎలాంటి ఎలక్ర్టానిక్‌ వస్తువులకు అనుమతి లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ కార్డుతో పాటు ఏదైనా ప్రత్యేక గుర్తింపుకార్డు ఉంటేనే గదిలోకి అనుమతిస్తారు. ఒకవేళ ఎలాంటి గుర్తింపుకార్డు లేకున్నా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకుని పరీక్షకు అనుమతిస్తారు. మొదటి పేపర్‌ ఉదయం 9:30 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు జరగనుంది. రెండో పేపర్‌ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరగనుంది. 


కొవిడ్‌ లక్షణాలు ఉన్న అభ్యర్థులను బయటకు పంపించకుండా ప్రత్యేకంగా గదిలో కూర్చోబెట్టి పరీక్ష రాయించనున్నారు. ఇందు కోసం ప్రతీ పరీక్ష కేంద్రంలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షకు హాజరయ్యే దివ్యాంగులకు హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ర్యాంపు, వీల్‌చైర్‌ను కూడా అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు పరీక్షకేంద్రాల రూట్‌ మాప్‌ తెలిసేలా బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ తప్పనిపరిస్థితుల్లో అభ్యర్థులు ఒక కేంద్రానికి బదులు మరో పరీక్షకేంద్రానికి వెళితే సకాలంలో సొంత పరీక్షకేంద్రానికి చేరేలా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. వాహనాలతో పాటు టూవీల్లర్‌లను కూడా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2020-10-03T11:05:31+05:30 IST