ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరల పెంపు!

ABN , First Publish Date - 2020-10-03T09:06:47+05:30 IST

ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆస్పత్రులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశా బ్దం కిందట నిర్ణయించిన ప్యాకేజీ ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల

ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరల పెంపు!

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు గ్రేడింగ్‌

యంత్రాలు, సౌకర్యాలను బట్టి మార్కులు

అన్ని చికిత్సలకు వైద్యం అందించాల్సిందే

సంస్కరణల దిశగా వైద్య శాఖ కసరత్తు


హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆస్పత్రులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశా బ్దం కిందట నిర్ణయించిన ప్యాకేజీ ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఆరోగ్యశ్రీలో సంస్కరణలు తీసుకురావాలని, ప్రస్తు త పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తెచ్చేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సంస్కరణలపై నేడో రేపో మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 323 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీతో అనుసంధానమై ఉన్నాయి. ఈ పథకం కింద 986 జబ్బులకు చికిత్స అందిస్తున్నారు.


ఆరోగ్యశ్రీ కార్డుదారులు 77.19 లక్షల మంది ఉన్నారు. అయితే ఆరోగ్య శ్రీ చికిత్స ధరలు ఎప్పుడో దశాబ్దం కింద ఖరారు చేసినవి కావడంతో వాటిని పెంచాలని కొంతకాలంగా నెట్‌ వర్క్‌ ఆస్పత్రులు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇంత తక్కువ ధరలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించలేమంటూ కొన్ని ఆస్పత్రులు అసలు రోగుల్నే తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే, ఆస్పత్రుల్లోని వసతులు, అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, సౌకర్యాల ఆధారంగా మార్కులు కేటాయించి.. ఆస్పత్రులను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించాలని భావిస్తోంది. కాగా, కొన్ని ఆస్పత్రులు ఒకటి, రెండు సెష్పాలిటీ సేవలకే పరిమితమవుతున్నాయి.


ఒకటో రెండో జబ్బులనే ఆరోగ్యశ్రీలోకి చేర్చి వాటికే వైద్యం అందిస్తున్నాయి. మిగిలిన జబ్బులకు చికిత్స అందించడం లేదు. ఆరోగ్య శ్రీ ప్యాకేజీ తమకు గిట్టుబాటు అవుతుందనుకుంటేనే శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. లేకపోతే నిరాకరిస్తున్నాయి. సర్కారు కొత్తగా తీసుకురాబోతున్న సంస్కరణ వల్ల ఇలాంటి తతంగాలకు తెరపడనుంది. ఆ ఆస్పత్రుల్లో ఉన్న అన్ని రకాల చికిత్సలను కచ్చితంగా ఆ పథకం కింద అందించాల్సి ఉంటుందని, నిరాకరించడానికి వీలుండదని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-10-03T09:06:47+05:30 IST