ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారు
ABN , First Publish Date - 2020-12-15T09:17:37+05:30 IST
ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయ

వాటికే పరిమితం.. ఉద్యోగాలు ఇవ్వట్లేదు
ఎన్నికల కోసమేసీఎం కేసీఆర్ ఆర్భాటం
విద్యార్థి సంఘాల నేతల మండిపాటు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయ, పోలీసుల పోస్టులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు కేసీఆర్ చేసిన ప్రకటనపై వారు విమర్శలు గుప్పించారు.
గతంలో ప్రకటించిన పోస్టులనే ఇప్పటివరకు భర్తీ చేయలేదని గుర్తు చేశారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడంతో పాటు వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని మరోసారి విద్యార్థులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పీడీఎ్‌సయూ, ఎస్‌ఎ్‌ఫఐ నేతలు ఆరోపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు మూతపడ్డాయని, ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటనతో ఆయా యాజమాన్యాలను ఆదుకుని, విద్యార్థుల జేబులు ఖాళీ చేసి, మానసిక ఒత్తిడికి గురిచేసేందుకు కుట్ర పన్నుతున్నారని తెలిపారు.
గతంలో పంచాయతీరాజ్, పోలీసు, ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కోర్టుల్లో పిటిషన్లు వేయించి నిలిపివేసిందని, దాని మాదిరిగానే మళ్లీ కొత్త ఉద్యోగాల పేరిట డ్రామాకు తెరతీశారని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 2 లక్షల మంది బీఈడీ, డీఈడీ లాంటి ఉపాధ్యాయ కోర్సులు అభ్యసిస్తున్నారని గుర్తు చేశారు. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 50 వేల మంది చదువుకుంటున్నారు.
నాలుగేళ్లలో జిల్లాలో రెండు లక్షల మంది వరకు ఉపాధ్యాయ కోర్సులు పూర్తిచేస్తే ప్రభుత్వ, సోషల్‌వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో సుమారు 650 మందికి ఉద్యోగాలు లభించినట్లు విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఆయా పాఠశాలలు, ప్రభుత్వ శాఖల్లో ప్రతి ఏటా వందలాది మంది రిటైర్‌మెంట్ అవుతున్నా వారిస్థానంలో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, జిల్లాలోని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, పీఈటీ పోస్టులు 1200పైగా ఖాళీగా ఉన్నాయని, వీటన్నింటిని తక్షణమే భర్తీ చేసి కొంతమందికైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
స్పష్టమైన ప్రకటన చేయాలి
ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలి. హడావుడి ప్రకటనలు చేసి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేయొద్దు. గత ఏడేళ్ల కాలంలో ఖాళీలను ఒకేసారి భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఎన్నికలను దృ ష్టిలో ఉంచుకుని నిరుద్యోగులను మోసం చేస్తే పీడీఎ్‌సయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం.
- శ్యామ్, పీడీఎ్‌సయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
50 వేల ఖాళీలను భర్తీ చేయాలి
సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా రాష్ట్రంలోని 50 వేల ఖాళీలకు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలి. లేకుంటే విద్యార్థి సంఘాలు మళ్లీ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తాయి.
- జావిద్, ఎస్‌ఎ్‌ఫఐ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు
