జువైనల్‌ జస్టిస్‌ నిబంధనలు అమలవుతున్నాయా?

ABN , First Publish Date - 2020-07-07T07:53:59+05:30 IST

జువైనల్‌ జస్టిస్‌ నిబంధనలు అమలవుతున్నాయా?

జువైనల్‌ జస్టిస్‌ నిబంధనలు అమలవుతున్నాయా?

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): వసతి గృహాలు, అనాథాశ్రమాల్లో జువైనల్‌ జస్టిస్‌ నిబంధనలు ఎంతవరకు అమలవుతున్నాయనే కోణంపై సీఐడీ విభాగం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు దృష్టిసారించారు. బాలకార్మికులను గుర్తించేందుకు ప్రతి ఏటా జూలై 1 నుంచి నెలరోజులపాటు నిర్వహించే ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’లో భాగంగా ఈ సారి వసతి గృహాలు, అనాథాశ్రమాలపై నిఘా పెట్టారు. జనవరిలో జరిగే ‘ఆపరేషన్‌ స్మైల్‌’, జూలైలో జరిగే ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’లలో.. కుటుంబ ఆదరణ, సంరక్షణ లేకుండా తిరిగే వారిని చేరదీసి, ఉచిత విద్య, వసతి అందజేస్తుంటారు. అలాంటి వారిని ప్రభుత్వ వసతి గృహాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే అనాథాశ్రమాల్లో చేర్పిస్తారు. అయితే ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఆశ్రమాలకు సంబంధించి సరైన రికార్డులు, సమాచారం లేదని పోలీసుశాఖ గుర్తించింది. చిన్న గదిని అద్దెకు తీసుకుని, పరిమితికి మించి పిల్లల్ని ఉంచుతూ.. వారి సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో.. ఆరో విడత ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’లో భాగంగా.. అనుమతుల్లేకుండా కొనసాగుతున్న అనాథాశ్రమాలపై చర్యలకు సిద్ధమవుతున్నారు. అనాథాశ్రమాల్లో ఉంటున్న చిన్నారుల సమగ్ర వివరాలను డేటాబే్‌సలో నమోదు చేస్తున్నారు. కేవలం దాతల విరాళాల కోసం పనిచేస్తున్న ఆశ్రమాలకు అందుతున్న నిధుల వివరాలను కూడా డేటాబే్‌సలో పొందుపర్చాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2020-07-07T07:53:59+05:30 IST