ఏప్రిల్‌లో సిలిండర్‌ తీసుకుంటేనే మేలో నగదు!

ABN , First Publish Date - 2020-04-07T08:52:39+05:30 IST

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే నగదుతో ఈ(ఏప్రిల్‌) నెలలో సిలిండర్‌ తీసుకుంటేనే మళ్లీ మే నెలలో డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడతాయి. ఇలా ఏప్రిల్‌, మేలో ఏ ఒక్క నెల

ఏప్రిల్‌లో సిలిండర్‌ తీసుకుంటేనే మేలో నగదు!

  • లేకపోతే ‘ఉజ్వల’ పథకం వర్తించదు
  • మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే నగదుతో ఈ(ఏప్రిల్‌) నెలలో సిలిండర్‌ తీసుకుంటేనే మళ్లీ మే నెలలో డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడతాయి. ఇలా ఏప్రిల్‌, మేలో ఏ ఒక్క నెల సిలిండర్‌ తీసుకోకపోయినా మరుసటి నెలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడవు. ఈ మేరకు పథకం మార్గదర్శకాలు తాజాగా విడుదలవ్వగా.. ఈనెల ఒకటో తేదీ నుంచే పథకం అమలులోకి వచ్చింది. దీని కింద మూడు మాసాల (ఏప్రిల్‌, మే, జూన్‌)కు మూడు సిలిండర్లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ నెల గ్యాస్‌ సిలిండర్‌ కొనటానికి అయ్యే డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తెలంగాణలో 10.75 లక్షల మంది ఉజ్వల లబ్ధిదారులున్నారు. దాంట్లో 9 లక్షల మంది లబ్ధిదారులు యాక్టివ్‌గా ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 796.50 పైసల చొప్పున రూ. 71.68 కోట్ల నిధులు బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. అయితే, ఒక ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేసి, దానిపై వినియోగదారుల సంతకం తీసుకోవాలని, రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నుంచే గ్యాస్‌ బుకింగ్‌ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాగా, గతంలో ‘దీపం’ పథకం కింద తీసుకున్న కనెక్షన్లు రాష్ట్రంలో 28 లక్షలున్నాయి. సీఎ్‌సఆర్‌(కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌) పథకం కింద తీసుకున్న కనెక్షన్లు 7 లక్షలున్నాయి. వీరికి ఈ ఉచిత గ్యాస్‌ పంపిణీ పథకం వర్తించదు. ఇతర బీపీఎల్‌, ఏపీఎల్‌ కనెక్షన్‌ ఉన్న వారికి కూడా వర్తించదు.


సాధారణ స్థితికి బుకింగ్‌లు

రాష్ట్రంలో గ్యాస్‌ బుకింగ్‌ల సంఖ్య సాధారణ స్థాయికి చేరుకొంది. మార్చి చివరి వారంలో రోజుకు 8 లక్షల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉండగా... ఇప్పుడు 2 లక్షలకు చేరుకున్నాయి. ఒకసారి సిలిండర్‌ తీసుకున్న తర్వాత 15 రోజులకు రెండో సిలిండర్‌ బుకింగ్‌ చేసుకునేలా నిబంధన అమలు చేస్తున్నారు.

Updated Date - 2020-04-07T08:52:39+05:30 IST