ఐదుగురు సమాచార కమిషనర్ల నియామకం

ABN , First Publish Date - 2020-02-11T08:42:09+05:30 IST

సమాచార హక్కు చట్టం కింద రాష్ట్ర కమిషన్‌కు ప్రభుత్వం కొత్తగా ఐదుగురు కమిషనర్లను నియమించింది. కమిషన్‌లో ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్‌గా

ఐదుగురు సమాచార  కమిషనర్ల నియామకం

  • శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, ఖలీలుల్లా, హుసేన్‌, శంకర్‌నాయక్‌కు చాన్స్‌
  • మూడేళ్లకు తగ్గిన పదవీకాలం..
  • హోదా, జీతభత్యాలకు కూడా కోత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం కింద రాష్ట్ర కమిషన్‌కు ప్రభుత్వం కొత్తగా ఐదుగురు కమిషనర్లను నియమించింది. కమిషన్‌లో ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్‌గా రాజా సదారాం, కమిషనర్‌గా బుద్దా మురళి ఉండగా కొత్తగా కట్టా శేఖర్‌ రెడ్డి, గగులోతు శంకర్‌ నాయక్‌, సయ్యద్‌ ఖలీలుల్లా, మైద నారాయణరెడ్డి, మహ్మద్‌ అమీర్‌ హుసేన్‌ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్ల పాటు పదవిలో ఉంటారు. తాజా నియామకంతో మొత్తం కమిషనర్ల సంఖ్య ఏడుకు చేరింది. కమిషనర్ల పదవీకాలం గతంలో ఐదేళ్లు ఉండేది. వీరి హోదా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమానంగా ఉండేది.


గత ఏడాది కేంద్ర ప్రభుత్వం  కమిషనర్ల అధికారాలు, హోదాను తగ్గించింది. ఈ మేరకు చట్టంలో సవరణలు చేసింది. ఇవి గత ఏడాది ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం గతంలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ హోదాకు సమానంగా ఉండే రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌ హోదాను తగ్గించారు. సీఎస్‌ హోదాకు సమానంగా ఉండే కమిషనర్‌ హోదానూ తగ్గించారు. వారికి చెల్లించే జీత భత్యాల్లోనూ కోత విధించారు. 2019 తర్వాత నియమితులైన సమాచార కమిషనర్లకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీని ప్రకారం ఐదుగురు కమిషనర్లు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రధాన సమాచార కమిషనర్‌ సదారాం ఈ ఏడాది ఆగస్టు 25న పదవీ విరమణ చేయనుండగా, కమిషనర్‌ మురళి సెప్టెంబరు 2022 వరకు కొనసాగనున్నారు. 


కట్టా శేఖర్‌ రెడ్డి

వయస్సు : 59, విద్యార్హత : బీఎస్సీ, ఎంఫిల్‌ 

నల్లగొండ జిల్లా మాడుగులపల్లికి చెందిన కట్టా శేఖర్‌ రెడ్డికి పాత్రికేయ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. 2014నుంచి ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో దశాబ్ద కాలానికి పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆరేళ్ల పాటు ‘ఆంధ్రజ్యోతి’ జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించారు. ఉదయం, వార్త దినపత్రికలు, మహాటీవీలో కూడా పనిచేశారు. 


ఆదిలాబాద్‌ జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీ దేవసేన.. ఆ స్థానానికి మరింత వన్నె తెచ్చేలా వ్యవహరించారు. సమస్యలను విన్నవించేందుకు దివ్యాంగులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ దేవసేన స్వయంగా వారి వద్దకే వెళ్లారు. వారితో పాటే నేలపై కూర్చొని వినతులను స్వీకరించారు. అక్కడే కూర్చుని దివ్యాంగుల సంఘం క్యాలెండర్‌నూ ఆవిష్కరించారు.  

 ఆదిలాబాద్‌ టౌన్‌


మైద నారాయణ రెడ్డి 

వయస్సు : 50, విద్యార్హత : డిగ్రీ 

సిద్దిపేట జిల్లా దౌలతాబాద్‌ మండలం ముబరు్‌సపూర్‌ గ్రామానికి చెందిన మైద నారాయణ రెడ్డి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. 1995లో ‘వార్త’లో సబ్‌ ఎడిటర్‌గా జర్నలిజంలో ప్రవేశించిన ఈయన ‘ఆంధ్రజ్యోతి’, ‘సాక్షి’, హెచ్‌ఎంటీవీలో రిపోర్టర్‌గా పనిచేశారు. టీన్యూస్‌ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 నుంచి 19 వరకు ప్రెస్‌ అకాడమీ సభ్యుడిగా పనిచేశారు. 


సయ్యద్‌ ఖలీలుల్లా 

వయస్సు : 58. విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ 

హైదరాబాద్‌ ఆఘాపురకు చెందిన సయ్యద్‌ ఖలీలుల్లా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. గుల్బర్గా యూనివర్సిటీలో 1989లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. సిటీ క్రిమినల్‌ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గల్ఫ్‌లో పనిచేస్తున్న వారికి తమ హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనేకమందికి న్యాయ సహాయం అందించారు.


జి.శంకర్‌ నాయక్‌ 

వయస్సు: 34, విద్యార్హత:ఎంఏ, ఎంఫిల్‌ 

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం బావోజీగూడెం గ్రామం బోజ్యతండాకు చెందిన జి.శంకర్‌ నాయక్‌ విద్యార్థి సంఘం నాయకుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. ఉస్మానియా జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 


మహ్మద్‌ అమీర్‌ హుసేన్‌ 

వయస్సు : 49 

విద్యార్హత : బీఎస్సీ, బీఈడీ,  ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ 

హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అమీర్‌ హుసేన్‌ న్యాయ సలహాదారుగా ఉన్నారు. బాలల హక్కులు, న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-11T08:42:09+05:30 IST