20 తర్వాతే అపెక్స్ కౌన్సిల్
ABN , First Publish Date - 2020-08-01T07:06:37+05:30 IST
అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈనెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ఆగస్టు 5వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని

హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈనెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ఆగస్టు 5వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్రం రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సమయం తక్కువగా ఉండడం, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం వంటి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. మరోవైపు.. ఈ ఏడాది నీటి కేటాయింపుల అంశంపై చర్చించడానికి వీలుగా వచ్చే వారంలో ప్రత్యేకంగా సమావేశం కావాలని కృష్ణా బోర్డు భావిస్తున్నది. కొత్త వాటర్ సీజన్ మొదలైనందున ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలు నీటి కేటాయింపులపై బోర్డుకు లేఖలు రాశాయి. పోతిరెడ్డిపాడు నుంచి 17 టీఎంసీల నీరు కావాలని ఏపీ ప్రభుత్వం, అలాగే 37 టీఎంసీలు కావాలని తెలంగాణ రాష్ట్రం బోర్డుకు ఇండెంట్‌ను సమర్పించాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే సమావేశం అనంతరం నీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకోవాలని బోర్డు భావిస్తున్నది. వర్కింగ్ మాన్యుల్స్ పేరిట ప్రాజెక్టులపై బోర్డుకు అధికారం ఇవ్వకూడదని తెలంగాణ రాష్ట్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించే అంశాలకు సంబంధించిన ఎజెండాను ఇప్పటికే కేంద్రం రాష్ట్రానికి పంపించింది. ఇందులో బోర్డుల పరిధి, అధికారుల వంటి వర్కింగ్ మాన్యువల్ కూడా ఉంది. చాలా కాలం నుంచి ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. బోర్డులకు అధికారాలను ఇవ్వాలనే విషయంలో కేంద్రం కూడా కొంత జోక్యం చేసుకుంటున్నది. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి వాటిని పూర్తిగా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వీటి నిర్వహణను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. అయితే వీటిని బోర్డుల పరిధిలోకి తీసుకువచ్చి, నీటి విడుదల, వాటి నిర్వహణ బాధ్యతలను బోర్డులకు అప్పగించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే దీనిని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. గురువారం సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష లోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రాజెక్టు నియంత్రణపై బోర్డులకు అధికారం ఇచ్చే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనిపై కఠినంగా ఉంటామని కూడా అధికారులకు సూచించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే విషయాన్ని కేంద్రానికి తెలియజెప్పాలని నిర్ణయించారు.