ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక: అంగముత్తు

ABN , First Publish Date - 2020-12-29T00:18:26+05:30 IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వ్యవసాయ, ప్రొసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక యాక్షన్ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఎపిఇడిఎ చైర్మన్ డాక్టర్ ఎం.

ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక: అంగముత్తు

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వ్యవసాయ, ప్రొసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక యాక్షన్ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఎపిఇడిఎ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు తెలిపారు. ఎపిఇడిఎ హైదరాబాద్ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలోనగరం లో సోమవారం ఏర్పాటు చేసిన ‘ఇంటరాక్షన్ మీట్ విత్ ఎక్స్ పోర్టర్స్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ ఎల్. వెంకట్రామ్ రెడ్డి, ఆర్గానిక్ సీడ్ సర్టిఫై అథారిటీ డైరెక్టర్ కేశవులు, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ, ప్రొసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతిదారులు, ఎపిఇడిఎ రీజినల్ ఇన్ చార్జి నాగపాల్ లోకారే, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.  


ఈ సందర్భంగా ఎపిఇడిఎ చైర్మన్ డాక్టర్. ఎం. అంగముత్తు మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత వ్యవసాయ, ప్రొసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కు ప్రత్యక ప్రాధాన్యతతో పాటు ప్రపంచ దేశాలలో డిమాండ్ ఉందన్నారు. దీని దృష్ట్యా ఈ ప్రాంతంలో గల ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు తగిన వనరులను కల్పించే భాగంగా ప్రత్యేక ఆక్షన్ ప్లాన్ రూపొందించేందుకు నిర్ణయించామని, దీనికి సంబంధించి ఎగుమతిదారుల నుంచి సూచనలు, సలహాలు వంటి ఇన్ పుట్స్ స్వీకరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ యాక్షన్ ప్లాన్ ఆధారంగా ఇతర దేశాలకు అవసరమైన ఉత్పత్తులు ఎగుమతి చేసే అంశాలకు సంబందించిన పూర్తి సమాచారం అందించడం జరుగుతుందన్నారు. 


ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలలో మనకు అంబాసిడర్లు ఉన్నారని అయితే 60 దేశాలలో మన ఉత్పత్తుల డిమాండ్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆ దేశాలకు ఎగుమతులు ప్రోత్సహించేందు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని  ఎగుమతిదారులను కోరారు.ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎగుమతిదారులు చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.




ట్రాన్స్ పోర్ట్ విషయంలో రైలు, విమాన, నౌకా సౌకర్యాలు వినియోగించుకోవడంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి దృష్టిసారించాలని, జి.ఎస్.టి వంటి పన్నులు, ఇతర రాష్ట్రాల్లో కల్పించే రాయితీలు అంశాలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని వివిరించారు. ఈ విషయంపై చైర్మన్ స్పందిస్తూ ఎగుమతిదారుల సమస్యల పరిష్కారానికి వీలుగా ప్రభుత్వం తరపున ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని సమావేశంలో పాల్గొన్న కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి, డైరెక్టర్ కేశవులను ఆదేశించారు. ఆ సమావేశానికి ఎపిఇడిఎ అధికారులుతోపాటు రైల్వే, షిప్పింగ్, ఏవియేషన్, జి.ఎస్.టి తదితర అధికారులు విధిగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.  


తెలంగాణ నుంచి మేలురకాలైన మామిడి పండ్లు, పూలు, వెజిటల్స్ ఎగుమతికి చక్కని అవకాశం ఉందని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి చైర్మన్ దృష్టి తీసుకు వచ్చారు. రాష్ట్రంలో 3000 ఎకరాల్లో ఆర్గానిక్ పంటల సాగు జరుగుతోందని, వాటిని సాగు చేసే రైతులను సంస్థ పరంగా ప్రోత్సాహకాలను అందించాలని ఆర్గానిక్ సీడ్ సర్టిఫై అథారిటీ డైరెక్టర్ కేశవులు చైర్మన్ ను కోరగా అందుకు తగిన చర్యలు తీసుకోగలమని హామీ ఇచ్చారు.అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో చైర్మన్ సమావేశమయ్యారు. వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ఎగుమతులు, వాటి అవకాశాలపై సమీక్షించారు.


Updated Date - 2020-12-29T00:18:26+05:30 IST