రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-15T08:56:59+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. రైతులు చేపట్టిన

మాజీ ఎంపీ వీహెచ్ ఒక రోజు దీక్ష
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో పోరాడాలి: మర్రి
రాంనగర్/హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా సోమవారం బాగ్ అంబర్‌పేటలోని తన నివాసంలో వీహెచ్ ఒక రోజు దీక్ష చేశారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి రైతులు చేసే దీక్షలో ఒక రోజు పాల్గొంటానని తెలిపారు. సీఎం కేసీఆర్ వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం చేసిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే విధంగా కేంద్రంతో పోరాటం చేయాలని దీక్షకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ పెడతానని ప్రకటించిన సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా దేశవ్యాప్తంగా అన్నదాతలు ఆందోళన చేస్తుంటే ఆ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం చట్టాలను రూపొందించిందని ఆరోపించారు. సాయంత్రం ఆయన వీహెచ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.
దీక్ష చేపట్టిన వీహెచ్‌ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ ఫోన్‌లో అభినందించారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేవని, అంతా పార్టీ అధిష్ఠానం చెప్పినట్లే వింటారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. పార్టీలో ప్రతి నేతకూ పదవి కోరే, అభిప్రాయం చెప్పే హక్కు ఉందని తెలిపారు. పోటీ ఉన్నంత మాత్రాన వర్గాలు ఉన్నట్టు కాదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.