తెలంగాణ సర్కార్ ఆ ఊసే ఎత్తలేదేం!?
ABN , First Publish Date - 2020-09-18T09:21:24+05:30 IST
రోజుకు దాదాపు 60 వేల దాకా కరోనా టెస్టులు చేస్తున్న సర్కారు.. వైరస్ వ్యాప్తిని...

- యాంటీబాడీ టెస్టులేవీ?
- కిట్లు, అధికారులు సిద్ధం.. అయినా 2 నెలలుగా వాయిదా
- ప్రైవేటు ల్యాబ్‌లకు క్యూ కడుతున్న ప్రజలు
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రోజుకు దాదాపు 60 వేల దాకా కరోనా టెస్టులు చేస్తున్న సర్కారు.. వైరస్ వ్యాప్తిని అంచనా వేయడంలో కీలకపాత్ర పోషించే యాంటీబాడీ టెస్టుల విషయంలో మాత్రం ముందడుగు వేయట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల యాంటీబాడీ టెస్టులు చేస్తామని చెప్పిన వైద్య, ఆరోగ్య శాఖ.. ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ టెస్టులకు సంబంధించిన కిట్లు, యంత్రాలు, అధికార యంత్రాంగమంతా సిద్థంగా ఉన్నప్పటికీ సర్వే మాత్రం మొదలుకావడం లేదు. దాదాపు 2 నెలలుగా యాంటీబాడీ టెస్టులను వాయిదా వేస్తూ వస్తున్నారు. వైరస్ వ్యాప్తిని తెలుసుకుని, దాన్ని ఎదుర్కొనే ప్రణాళికలు రూపొందించుకునేందుకు దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఐసీఎంఆర్ ఈ తరహా సర్వేలు చేయిస్తోంది. తెలంగాణలోనూ 3 జిల్లాల్లో రెండుసార్లు ఐసీఎంఆర్ ఈ సర్వే చేయించింది. ప్రతి రాష్ట్రం సొంతంగా ఇటువంటి సర్వేలు నిర్వహించుకోవాలని ఐసీఎంఆర్ జూన్‌లో సూచించింది. కానీ, మనదగ్గర మాత్రం అటువంటిదేమీ జరగట్లేదు. కరోనాపై పోరులో ముందు వరుసలో ఉండే డాక్టర్లు, వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుధ్య పనివారికి, పాత్రికేయులకు తొలుత యాంటిబాడీ టెస్టులు చేయించాలని నిర్ణయించారు. ఆ తర్వాత వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే వృద్థులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి చేయించాలని భావించారు. ఇందుకోసం 25 వేల కిట్లను తెప్పించారు. హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రాంగణంలో ఈ టెస్టులు చేయాలని నిర్ణయించారు. నమూనాలను పరీక్షించడానికి అవసరమైన యంత్రాలను నారాయణగూడలోని ఐపీఎం ల్యాబ్‌లో ఇన్‌స్టాల్ చేయించారు.
టెక్నీషియన్లకు శిక్షణ కూడా ఇప్పించారు. ఆ యంత్రాలతో రోజుకు కనీసం వెయ్యి నమూనాలను పరీక్షించే వీలుంటుందన్నారు. అయితే.. యాంటిబాడీ సర్వే కోసం అనుమతులివ్వాలని, ఆర్థిక వనరులు సమకూర్చాలని వైద్య, ఆరోగ్య శాఖ సర్కారుకు మొరపెట్టుకున్నా ఉపయోగం లేకుండాపోయింది. ఇంతవరకూ అనుమతి రాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా టెస్టులు, కేసులు, మరణాల విషయంలో క్షేత్రస్థాయి లెక్కలకు, ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్‌కు మధ్య భారీగా తేడా ఉంటోంది. ఇలాంటి సమయంలో యాంటిబాడీ సర్వే చేస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. అందుకే సర్కారు యాంటిబాడీ టెస్టులు చేయట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కారీలో యాంటీబాడీ టెస్టులు చేయించుకునే వీలు లేకపోవడంతో చాలా మంది ఈ పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. రూ.1200 కట్టి ఆ పరీక్ష చేయించుకుంటున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లలో చేస్తున్న యాంటీబాడీ టెస్టుల్లో.. దాదాపు 45 శాతం మందికి యాంటీబాడీస్ ఉత్పత్తి అయినట్టు తేలిందని సమాచారం.