ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుతో మరో రూ.13 వేల కోట్లు

ABN , First Publish Date - 2020-05-18T08:50:07+05:30 IST

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ర్టానికి పెద్ద ఊరట.. దాంతో పాటే తీవ్ర ఆందోళన నెలకొంది. కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రుణం తీసుకోవడానికి వెసులుబాటు లభించినా.. షరతులు వర్తిస్తాయన్న

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుతో మరో రూ.13 వేల కోట్లు

  • ఈ ఏడాదిలో 47 వేల కోట్ల వరకు రుణానికి చాన్స్
  • కేంద్ర షరతులపై రాష్ట్రం ఆందోళన
  • మార్గదర్శకాలు విడుదలైతే స్పష్టత


హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ర్టానికి పెద్ద ఊరట.. దాంతో పాటే తీవ్ర ఆందోళన నెలకొంది. కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రుణం తీసుకోవడానికి వెసులుబాటు లభించినా.. షరతులు వర్తిస్తాయన్న ప్రకటనతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకున్న ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది (2020-21)లో రూ.34 వేల కోట్ల రుణాలను తీసుకోవాలని బడ్జెట్‌లో నిర్ణయించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 5 శాతానికి పెంచడంతో అదనంగా రూ.13 వేల కోట్ల రుణాలు తీసుకోవచ్చు. దీంతో మొత్తంగా రూ.47 వేల కోట్ల మేర రుణాన్ని తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. అయితే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూనే కేంద్రం పలు సంస్కరణలను రాష్ర్టాలపై రుద్దడానికి సిద్ధం అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం కొన్ని రంగాల్లో కీలక మార్పులను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ను ప్రకటించింది. ముఖ్యంగా వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దీని కింద రేషన్‌ కార్డు ఉన్న వారు దేశంలో ఎక్కడైనా రేషన్‌ను తీసుకోవచ్చు. తెలంగాణలో తెలుపు రంగు కార్డుదారులకు రూపాయికి కిలో బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నారు. కేంద్రమిచ్చే బియ్యం కోటాతోపాటు ధర కూడా రాష్ట్రం ఇచ్చే దానితో పోలిస్తే తేడా ఉంది. ఇతర రాష్ర్టాల వారికి ఇక్కడ బియ్యం ఇవ్వాలంటే అదనపు భారం పడనుంది. ఇక ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంలో తెలంగాణ ముందు వరసలో ఉంది. ఈ విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధిలోనూ తెలంగాణ అగ్రభాగాన ఉన్నప్పటికీ, పన్ను వసూళ్ల విషయంలో ఇంకేమైనా చర్యలు తీసుకోవాలా? లేదా? అనే విషయంపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. అన్నింటికన్నా విద్యుత్‌ సరఫరా రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు అనుమానాలున్నాయి.  డిస్కమ్‌ల ప్రైవేటీకరణ, విద్యుత్‌ సబ్బిడీ నేరుగా అందించడం, ఉచిత విద్యుత్‌ నిలిపివేత వంటి అంశాల్లో రాష్ర్టానికి తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఈ నిబంధనలు పాటిస్తేనే రుణ పరిమితి పెంపునకు రాష్ట్రం అర్హత సాధిస్తుందని కేంద్రం జారీ చేయబోయే మార్గదర్శకాల్లో పొందుపరిస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.   

రుణాలపైనే భారం!

కరోనా మూలంగా రాష్ట్ర ఆదాయానికి గండి పడింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్లుగా ప్రతిపాదించినప్పటికీ అందులో పేర్కొన్న ప్రకారం ఆదాయం రావడం లేదు. ప్రతి నెల సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం రాష్ర్టానికి రావాల్సి ఉంటుంది. ఏప్రిల్‌లో కేవలం రూ.1,600 కోట్ల ఆదాయమే వచ్చినట్టు కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్రం నుంచి విపత్తు నిర్వహణ నిధుల కింద రూ.450 కోట్లు, జీఎస్టీ పరిహారంగా రూ.269 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తుల కింద రూ.181 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.253 కోట్లు వచ్చాయి. ఇలా కేంద్రం నుంచి సుమారు రూ.983 కోట్లు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.4 వేల కోట్లు బాండ్ల వేలంతో సమీకరించింది. ఏప్రిల్‌తో పోల్చితే మే నెలలో కొంత ఎక్కువ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ నెలలో ఇప్పటికే రూ.2 వేల కోట్లు బాండ్ల వేలం ద్వారా పొందారు. కేంద్రం నుంచి వచ్చే ఆదాయం పెరిగే వీలుంది.  జూన్‌లో చెల్లించాల్సిన ఉద్యోగుల జీతాలు, పింఛన్ల కోసం సుమారు రూ.1,800 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.830 కోట్లు,  రైతు బంధు వంటి వాటికి భారీగానే నిధుల అవసరం ఉంటుంది. 

కేంద్ర నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి: వినోద్‌

కేంద్రం ప్రకటించిన వాటిలో రాష్ర్టానికి పెద్దగా ఉపయోగపడేవిలేవని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. కేంద్ర నిర్ణయాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుతూనే అనేక షరతులను విధించడం సమంజసంగా లేదన్నారు. కేంద్ర నిర్ణయం వల్ల తెలంగాణకు కొత్తగా ఎలాంటి ప్రయోజనం కలగదన్నారు. విద్యుత్‌ సరఫరాలో అనేక మార్పులు తీసుకువస్తున్నారని, రాష్ట్రంలో ఈ మార్పుల అమలు సాధ్యంకాదని చెప్పారు. డిస్కమ్‌ల ప్రైవేటీకరణ, ఉచిత విద్యుత్‌ పథకం ఎత్తివేత వంటి వాటిని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఎక్కువ శాతం ఆర్‌బీఐ, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులను అనుసంధానించడమే తప్ప.. నేరుగా కేంద్రం ఇచ్చేవి తక్కువగా ఉన్నాయని చెప్పారు.

Updated Date - 2020-05-18T08:50:07+05:30 IST