తెలంగాణలో బీజేపీ మరో ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఈసారి ఏకంగా..!

ABN , First Publish Date - 2020-12-25T17:49:05+05:30 IST

తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ మరో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు సిద్ధమవుతోందా?

తెలంగాణలో బీజేపీ మరో ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఈసారి ఏకంగా..!

తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ మరో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు సిద్ధమవుతోందా? అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో బీసీ నాయకులను ఆకర్షించడమే లక్ష్యంగా పావులు కదుపుతోందా? ఇప్పటికిప్పుడు బీసీ నాయకులపై ఆ పార్టీకి ఎందుకంత మక్కువ పుట్టుకొచ్చింది? రాష్ట్రంలో భవిష్యత్ తమదే అంటున్న కాషాయ నేతల తాజా ప్లాన్ ఏంటి? అధికార పార్టీలో ఏ ప్రముఖులపై ఆ పార్టీ కన్ను పడింది‌? బీసీ మంత్రం పదే పదే జపించడం వెనుక ఏ మతలబు దాగుంది? వాచ్ దిస్‌ ఏబిఎన్ ఇన్ సైడ్ ఇంట్రెస్టింగ్‌ కథనం.


ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగించేందుకు..!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కమలనాథుల కన్ను బలమైన గులాబీ పార్టీలోని బీసీ నాయకులపై పడిందట. ఆ పార్టీలోని బీసీ లీడర్లపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగించేందుకు తెరవెనక ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు మొత్తం జనాభాలో దాదాపుగా 80 శాతానికి పైగా ఉంటారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీ, ఎస్సీ కాంబినేషన్‌లోనే కాంగ్రెస్‌ పార్టీని నడిపింది. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ అధ్యక్ష పదవిని.. దళితుడైన దామోదర రాజనరసింహకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించింది. అధికారంలోకి పార్టీని తేలేకపోయినా..కాంగ్రెస్ కనీసం తన ఉనికి చాటుకుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. 2018 ముందస్తు ఎన్నికల్లో టిడిపితో జతకట్టి రెడ్ల నాయకత్వంలో ముందుకెళ్ళింది. అయినా హస్తం పార్టీకి ఓటమి తప్పలేదు. తెలంగాణలో మెజారిటీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు టీఆర్ఎస్‌కు అండగా నిలవడమే కాంగ్రెస్ పరాజయానికి కారణమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


ముందుగా సంకేతాలు..

అయితే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తరహాలో కాకుండా రాష్ట్రంలో బీసీలను పూర్తిగా ఓన్ చేసుకోవాలనేది కమలనాథులు అభిప్రాయంగా తెలుస్తోంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా ఉండేవారు. టీడీపీ బలహీనపడటంతో బీసీలు రాజకీయంగా వెనుకబడిపోయారు‌. ఒకప్పుడు టీడీపీతో ఉన్న బీసీలను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగానే బీసీల్లో బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది ఆ పార్టీ అధిష్టానం. మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం మున్నూరు కాపు వర్గామే. లక్ష్మణ్‌కు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. తద్వారా తెలంగాణలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న సంకేతాలను కమలనాథులు పంపారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అరవింద్‌లకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు పోటీచేసే అవకాశాన్ని బీజేపీ కల్పించింది. ఇదంతా బీసీలను ఆకర్షించేందుకే అని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 


సంప్రదింపులు.. 

టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వెలమలు, రెడ్ల బలముందని.. బీసీలను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ పెద్దలు వ్యూహాలకు పదునుపెడుతున్నారట. ఇప్పటికే గులాబీ పార్టీపై గురిపెట్టి ఆ పార్టీలోనిబీసీ నాయకులతో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ సహా పలువురు సీనియర్లు సంప్రదింపులు జరుపుతున్నారట. టీఆర్ఎస్ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఆకర్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారట. గత ఎన్నికల్లో‌ టీఆర్ఎస్ టికెట్లు ఆశించి భంగపడ్డవారిని బీజేపీ ప్రధానంగా టార్గెట్ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. జిల్లాల వారీగా ఇలాంటి వారి జాబితాను కమలనాథులు ఇప్పటికే సిద్ధం చేశారట.‌ ఉత్తర తెలంగాణ నుంచే "ఆపరేషన్ బీసీ"ని ప్రారంభించాలని నిర్ణయించారట.


ఈసారి ఏకంగా మాజీ మంత్రినే..!

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీమంత్రి జోగు రామన్నను కమలనాథులు కదిపే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఫస్ట్ టర్మ్‌లో మంత్రిగా పనిచేసిన రామన్నకు పార్టీలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిపేరు ఉంది. ఆయనను పార్టీలో చేర్చుకుంటే జిల్లా అంతటా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారట. అయితే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు అత్యంత నమ్మకంగా ఉంటున్న రామన్న బీజేపీ గాలానికి చిక్కుతారా అనే సందేహాలు వ్యక్తమవున్నాయట. నిజామాబాద్‌, మెదక్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్‌, బీసీ నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు బలమైన బీసి సామాజిక వర్గానికి చెందిన మంత్రులున్నారు. 


సక్సెస్ అవుతుందో.. వికటిస్తుందో!

అయితే ఈ ఇద్దరూ పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారట. నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో కూడా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు బీసీ లీడర్లపై బిజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ముందే పసిగట్టిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందన్న మరో టాక్‌ వినిపిస్తోంది. తమ పార్టీలో ఉన్న బీసి నేతలను ఎట్టి పరిస్థితుల్లో చేజారనివ్వొద్దని ఇద్దరు అగ్రనేతలకు అధినేత  కేసిఆర్ బాధ్యతలు అప్పగించారట. మరి బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ సక్సెస్‌ అవుతుందా? లేక కేసీఆర్‌ వ్యూహాలతో వికటిస్తుందో చూడాలి.

Updated Date - 2020-12-25T17:49:05+05:30 IST