మరో 3 లక్షల యాంటీజెన్ టెస్టులు!
ABN , First Publish Date - 2020-07-18T07:58:36+05:30 IST
కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా చేయడం లేదని పెద్దయెత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు పరీక్షల సంఖ్యను పెంచుతోంది. మరో 3 లక్షల యాంటీజెన్ టెస్టులు చేయాలని ప్రభుత్వం తాజాగా

హైదరాబాద్, జులై 17 (ఆంధ్రజ్యోతి): కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా చేయడం లేదని పెద్దయెత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు పరీక్షల సంఖ్యను పెంచుతోంది. మరో 3 లక్షల యాంటీజెన్ టెస్టులు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. తొలుత 2 లక్షల యాంటీజెన్ టెస్టులు చేయాలని భావించగా, వాటికి అదనంగా మరో 3 లక్షల చేయనున్నారు. అందుకు సంబంధించిన కిట్ల ఇండెంట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో యాంటీజెన్ టెస్టులు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 50 వేల యాంటీజెన్ పరీక్షలు పూర్తిచేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నెల 16న ఏకంగా 14,027 టెస్టులు చేశారు. 24 గంటల్లో ఇన్ని పరీక్షలు చేయడం ఇదే తొలిసారి. రాబోయే రోజుల్లో అవసరమైతే రోజుకు 20 వేల పరీక్షలు కూడా చేయాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గురువారం చేసిన టెస్టులతో రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 2.08 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న యాంటీజెన్ కిట్లకు తోడు అదనంగా మరో 3 లక్షల కిట్లు తెప్పించనున్నారు. దాంతో మరింత విస్తృతంగా టెస్టులు నిర్వహించనున్నారు.