ఏడాదికోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం
ABN , First Publish Date - 2020-10-07T07:23:40+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని కేంద్ర జలశక్తి శాఖ

కృష్ణా జలాల కేటాయింపుపై
సుప్రీంలో తెలంగాణ వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంటే
ట్రైబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తాం
కేంద్ర మంత్రి షెకావత్ వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ఏడాదికోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలని అభిప్రాయపడ్డారు. మంగళవారమిక్కడ ఆయన అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అనంతరం షెకావత్ సమావేశం వివరాలను విలేకరులకు వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధులను నోటిఫై చేసే అంశం ఆరేళ్లుగా అపరిష్కృతంగా ఉందని మంత్రి చెప్పారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగానే ఇది పెండింగ్‌లో ఉందన్నారు.
బోర్డుల పరిధులను నోటిఫై చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించలేదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నోటిఫై చేయడానికి ఏకాభిప్రాయం అవసరం లేదని, ఈ విషయాన్ని కేసీఆర్‌కు కూడా తెలియజేశానని అన్నారు. దీంతో అలాగే ముందుకెళ్లండని ఆయన కూడా అన్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ట్రైబ్యునల్ ఏర్పాటుకు వీలుగా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. దీనిపై న్యాయసలహా తీసుకుంటామన్నారు. ప్రస్తుతమున్న ట్రైబ్యునల్‌ను కొనసాగించాలా లేక కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.
గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు విజ్ఞప్తులు పంపించాలని రెండు రాష్ట్రాలను కోరగా.. బుధవారమే వినతి పత్రం పంపిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని నిర్ణయించామని, అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారని వెల్లడించారు. సమావేశం ఫలప్రదమైందన్నారు. ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేశాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ఒకరికి బాగా కనిపించింది. మరొకరికి చెడుగా కనిపించింది. కాబట్టి ముందు ఎవరి ఇంటిని వారు బాగుచేసుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. 2016లో అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశం జరిగిందని, నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు రెండో సమావేశం జరిగిందని తెలిపారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదంపై విలేకరులు ప్రస్తావించగా.. ‘‘ఎజెండాలో ఉన్న అంశాలపైనే చర్చించాం. ఏ రాష్ట్రం ఏ ప్రాజెక్టు చేపట్టినా చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమకు అప్పగించాలన్న తెలంగాణ ప్రభుత్వ వాదనపై స్పందిస్తూ.. చట్ట ప్రకారం కృష్ణా బోర్డు దాన్ని నిర్వహించాలని, బోర్డు పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో బోర్డే నిర్వహిస్తుందని చెప్పారు. అన్ని వివాదాలకు పరిష్కారం లభించినట్టేనా అని విలేకరులు ప్రశ్నించగా.. తాను దేవుడిని కాదన్నారు. సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, తరచూ కూర్చొని చర్చించుకుంటే ముందుకెళ్లవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. కనీసం ఏడాదికోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలని ఆకాంక్షించారు.
పోలవరం బిల్లులను చెల్లించాం
పోలవరం ప్రాజెక్టుకు రీయింబర్స్ పద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నామని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన బిల్లులన్నీ క్లియర్ చేశామని షెకావత్ వెల్లడించారు. కరోనా వల్ల పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లలేకపోయానన్నారు. ఈ నెలాఖరులో లేదా నవంబరు ప్రారంభంలో వెళ్తానని తెలిపారు.