‘అన్నమయ్య మనకు దొరికిన గొప్ప వరం’
ABN , First Publish Date - 2020-12-28T12:10:07+05:30 IST
అన్నమయ్య కీర్తనలు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని...

హైదరాబాద్/బేగంపేట : అన్నమయ్య కీర్తనలు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. ఆదివారం బేగంపేటలోని స్టేట్ బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్స్యూమర్ బ్యాంకింగ్‌లో యాజుషీ క్రియేషన్స్ అద్వర్యంలో ‘అన్నమయ్య శ్రీకృష్ణ సమ్మెహనమ్’ గ్రంథావిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన వెంకట్ గరికపాటి రచించిన అన్నమయ్య శ్రీకృష్ణ సమ్మోహనమ్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్(ఫైనాన్స్)జె. స్వామినాథన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సంగీతం, సాహిత్యం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. గ్రంథం ఆవిష్కరించేందుకు మీకు ఏమి ఆర్హత ఉందని ఈ కార్యక్రమానికి వచ్చే ముందు తన పిల్లలు ప్రశ్నించారని, అన్నమయ్య కీర్తనలపై తనకు ఉన్న అపారమైన అభిమానమే పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఉన్న అర్హత అని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజలకు అర్ధమయ్యే పదాలతో కీర్తలను చెప్పడంతో ఇవి ఎప్పుడూ ప్రజలలో పదిలంగా ఉంటాయి అని అన్నారు. అన్నమయ్య మనకు గొప్ప వరమన్నారు. వెంకట్ గరికపాటి వ్యాఖ్యానాలు తనను ఏంతో ప్రభావితం చేశాయన్నారు. తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు, వ్యాఖ్యాత వెంకట్ గరికపాటి మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి రూపం మోహనం.. నవనీత చోరుని నవమైన తుంటరి పనులు స్నిగ్ధమోహనం.. ద్వాపరాన గోపికలతో గోవిందుని కేళీకలాపం నవ మోహనం.. అద్వితీయంగా సంచరించిన బృందావన విహారుడైన ముకుందుని మకరందభరితమైన చేతలు ఆసాంతం సమ్మోహనం.. అందుకే ఈ వ్యాఖ్యాన గ్రంథానికి ‘శ్రీకృష్ణ సమ్మోహనమ్’ అని పేరు ఎంచుకున్నానన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఎండీ వినయ్ టాన్‌సే, యాజుషీ క్రియేషన్స్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.