ఎన్‌ఐఏ అదుపులో ఆనంద్‌ తెల్‌తుంబ్డే

ABN , First Publish Date - 2020-04-15T09:45:24+05:30 IST

బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజైన మంగళవారం ఆయన మనవరాలి భర్త, సామాజిక కార్యకర్త ఆనంద్‌ తెల్‌తుంబ్డేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది.

ఎన్‌ఐఏ అదుపులో ఆనంద్‌ తెల్‌తుంబ్డే

ఎల్గార్‌ పరిషత్‌-మావోయిస్టు లింక్‌ కేసు ఆరోపణలు

సహ నిందితుడు గౌతమ్‌ నవ్‌లఖా ఢిల్లీలో అరెస్టు

ఆనంద్‌, గౌతమ్‌, వరవరరావులను విడుదల చేయాలి

కేసు ఎత్తివేయాలి.. ఉపా చట్టాన్ని రద్దు చేయాలి: తమ్మినేని

పాలమూరు అధ్యయన వేదిక, న్యూడెమోక్రసీ కార్యకర్తల దీక్షలు


ముంబై/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజైన మంగళవారం ఆయన మనవరాలి భర్త, సామాజిక కార్యకర్త ఆనంద్‌ తెల్‌తుంబ్డేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది. ఎల్గార్‌ పరిషత్‌-మావోయిస్టు లింక్‌ కేసులో ఆనంద్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎల్గార్‌ పరిషత్‌-మావోయిస్టు కేసులో సామాజిక కార్యకర్త గౌతమ్‌ నవ్‌లఖా సహనిందితుడు. ఆయన కూడా ఢిల్లీలో ఎన్‌ఐఏ ఎదుట లొంగిపోయారు. 


ఉపా చట్టం పేరుతో జైల్లో.. 

ప్రొఫెసర్‌ ఆనంద్‌ తెల్‌తుంబ్డేపెట్టిన కేసును ఎత్తివేసి ఉపా చట్టాన్ని రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రదం డిమాండ్‌ చేశారు. భీమా-కోరెగావ్‌ ఘటనలో ప్రధానమంత్రిని హత్యచేయడానికి కుట్రపన్నారనే సాకుతో ఉపా చట్టం కింద అనేక మంది మేధావులపై కేసులు నమోదుచేసి పలువురిని జైలుకు పంపారని ఆరోపించారు. ఆనంద్‌ తెల్‌తుంబ్డే అరెస్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్టే విధించిందని చెప్పారు. ఆనంద్‌ అరెస్టును ఉపసంహరించుకుని కేసును ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. కాగా అరెస్టు చేసిన ప్రజాస్వామిక మేధావులు ప్రొఫెసర్‌ ఆనంద్‌ తెల్‌తుంబ్డే, గౌతమ్‌ నవ్లాఖా, వరవరరావు తదితరులను తక్షణమే విడుదల చే యాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ ఎం. రాఘవాచారి డిమాండ్‌ చేశారు.


రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజైన మంగళవారమే వారిని అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేకు తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎక్కడికక్కడ తమ ఇళ్లలోనే నిరాహారదీక్షలు చేశారు. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో తన ఇంట్లోనే రాఘవాచారి నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామిక మేధావులపై మహారాష్ట్ర ప్రభుత్వం భీమా-కోరేగావ్‌ కుట్ర కేసు నమోదు చేసిందని, విచారణ నిర్వహించకుండా బెయిల్‌ ఇవ్వకుండా వ్యవహరించిందని ఆరోపించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన వెంటనే ఈ కేసును కేంద్రం స్వాధీనం చేసుకొని ఎన్‌ఐఏ ద్వారా ఊపా చట్టం కింద నమోదు చేసిందని అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అధ్యయన వేదిక నాయకులు ఎవరి ఇళ్లలో వారు ఈ నిరశనలో పాల్గొన్నారు. తిమ్మప్ప, వెంకట్‌గౌడ్‌, బాలజంగయ్య, నారాయణ, ఇక్బాల్‌పాషా, హనుమంతు, అలీ, శాంతన్న, రాజేంద్రబాబు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ఆనంద్‌ తెల్‌తుంబ్దేను అరెస్టు చేయొద్దని, భీమా-కోరెగావ్‌ కేసులను ఎత్తివేయాలని సీపీఐ (ఎంఎల్‌)న్యూడెమొక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కార్యకర్తలు తమ నివాసాల్లోనే ఫ్లకార్డులు పట్టుకుని, దీక్ష చేపట్టారు.

Updated Date - 2020-04-15T09:45:24+05:30 IST