ఆస్పత్రుల్లోని పడకల వివరాలు తెలిపే యాప్‌

ABN , First Publish Date - 2020-07-22T09:03:19+05:30 IST

ఆస్పత్రుల్లోని పడకల వివరాలు తెలిపే యాప్‌

ఆస్పత్రుల్లోని పడకల వివరాలు తెలిపే యాప్‌

  • హైకోర్టు ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు

హైదరాబాద్‌, జులై 21(ఆంధ్రజ్యోతి): హైకోర్టు మొట్టికాయల నేపథ్యంలో పడకల విషయంలో పారదర్శకత పాటించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఉపక్రమించింది. పడకల కొరత ఉందంటూ రోగులను ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా అదే బాణీ కొనసాగుతుండడంతో.. అత్యవసర వైద్య సహాయం అవసరమైన రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేటు వైద్య కళాశాలల్లోని ఖాళీ పడకల వివరాలను ప్రజలకు తెలిపేందుకు మొబైల్‌ యాప్‌ను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేస్తోంది. అత్యవసర చికిత్స అవసరమైన రోగులు ఇకపై ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.


ఆ యాప్‌ ద్వారా పడకలు అందుబాటులో ఉన్న ఆస్పత్రుల వివరాలను తెలుసుకోవచ్చు. వెంటనే అడ్మిషన్‌ పొందవచ్చు. పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ రోగులను చేర్చుకోని ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదులు కోసం ప్రత్యేకంగా ఒక ఫోన్‌ నెంబరును ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిని మంగళవారం నుంచే ప్రారంభించాలని అనుకున్నా, అనివార్య కారణాల వల్ల ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతోందని చెప్పారు.

Updated Date - 2020-07-22T09:03:19+05:30 IST