141 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష

ABN , First Publish Date - 2020-10-04T07:55:08+05:30 IST

సత్ప్రవర్తన కలిగిన 141 మంది జీవిత ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.

141 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష

రూ.50 వేల వ్యక్తిగత బాండ్‌తో విడుదల

ఉప ఎన్నికల వల్ల నాలుగు జిల్లాల్లో విడుదలకు బ్రేక్‌


హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సత్ప్రవర్తన కలిగిన 141 మంది జీవిత ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. గాంధీ జయంతి సందర్భంగా వీరిని విడుదల చేయాలని జైళ్లశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. క్షమాభిక్ష ప్రసాదించిన 141 మందిలో 20 మంది మహిళాఖైదీలున్నారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలునుంచి 39 మంది, చంచల్‌గూడ సెంట్రల్‌ జైలు నుంచి 14 మంది, చర్లపల్లి సెంట్రల్‌ జైలు నుంచి 19 మంది, చర్లపల్లి ఓపెన్‌ ఎయిర్‌ జైలు నుంచి 26 మంది, చంచల్‌గూడ మహిళా జైలు నుంచి 20 మంది, నిజామాబాద్‌ జిల్లా జైలు నుంచి ఏడుగురు, కరీంనగర్‌ జిల్లా జైలు నుంచి ఆరుగురు, ఖమ్మం జిల్లా జైలు నుంచి నలుగురు, సంగారెడ్డి జిల్లా జైలు నుంచి ముగ్గురు, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాల జైళ్లనుంచి, మిర్యాలగూడ సబ్‌ జైలు నుంచి ఒక్కొక్కరి చొప్పున ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.


శనివారం ఉదయమే ఉత్తర్వులు వెలువడగా.. సాయంత్రానికి జైళ్ల నుంచి కొందరు ఖైదీలు విడుదలయ్యారు. మొదట పంద్రాగస్టునే ఖైదీలను విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినా మార్గదర్శకాల రూపకల్పనలో జాప్యం జరగడంతో గాంధీ జయంతికి వాయిదాపడింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నిజామాబాద్‌, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్‌ జిల్లాల పరిధిలో క్షమాభిక్ష ప్రసాదించిన జీవిత ఖైదీలను ప్రస్తుతం విడుదల చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పూర్తయిన తర్వాత విడుదల చేయాలని పేర్కొంది.


మళ్లీ నేరం చేస్తే క్షమాభిక్ష రద్దు!

విడుదలైన ఖైదీలు మళ్లీ నేరం చేస్తే క్షమాభిక్ష రద్దవుతుందని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. వారం రోజుల్లోపు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌(ఎ్‌సహెచ్‌వో)కు విడుదల ఉత్తర్వులతోపాటు రూ.50 వేల వ్యక్తిగత బాండ్‌ను సమర్పించాలని తెలిపింది. శిక్షాకాలం ముగిసేవరకు ఆరు నెలలకోసారి రెండేళ్లపాటు ఎస్‌హెచ్‌వోకు రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుందని, అంతేకాకుండా మిగిలిన శిక్షాకాలాన్ని అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

Updated Date - 2020-10-04T07:55:08+05:30 IST