అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్దాం
ABN , First Publish Date - 2020-12-03T06:45:29+05:30 IST
పెద్ద కారులో వేరే ఊరుకు తీసుకెళ్తున్నామని చెప్తే ఆనందంగా ఎక్కి కూర్చున్నాడా బాలుడు! నిద్రలో ఉండగానే పెద్ద శబ్దం!!

రోడ్డుప్రమాదంలో తల్లిని పోగొట్టుకున్న చిన్నారి దీనాలాపన
ఇన్నోవా-బోర్‌వెల్ లారీ ఢీ.. ఎనిమిది మంది దుర్మరణం
మృతుల్లో నలుగురు మహిళలతో పాటు నాలుగేళ్ల పాప
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ వద్ద విషాదం
చేవెళ్ల, మదీన, డిసెంబరు 2: పెద్ద కారులో వేరే ఊరుకు తీసుకెళ్తున్నామని చెప్తే ఆనందంగా ఎక్కి కూర్చున్నాడా బాలుడు! నిద్రలో ఉండగానే పెద్ద శబ్దం!! ఉలిక్కిపడి కళ్లు తెరిచి చూసేసరికి ఏముంది..! అయినవారంతా విగతజీవులై కనిపించారు!! తల్లి మృతదేహం వద్ద కూర్చుని.. గుండెల్లోంచి ఏడుపు తన్నుకొస్తుండగా.. ‘అమ్మా.. లేమ్మా.. ఇంటికి పోదాం’ అని పిలిచాడు. ఎప్పుడూ పిలవగానే బదులిచ్చే అమ్మ పలకకపోవడంతో హృదయవిదారకంగా రోదించాడు. బుధవారం ఉదయం చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిని కోల్పోయిన ఓ పసివాడి దీనాలాపన ఇది!! ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 11 ఏళ్ల బాలుడితోపాటు, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు.
హైదరాబాద్ కాలాపత్తర్‌లోని మక్కా కాలనీకి చెందిన నాజియా బేగం (40) కొంతకాలంగా కీళ్ళనొప్పులు, పక్షవాతంతో బాఽధపడుతున్నారు. స్థానికంగా వైద్యం చేయించుకున్నప్పటికీ తగ్గకపోవడంతో కర్ణాటకలోని గురుమిట్ కల్‌లో ఆయుర్వేద మందు దొరుకుతుందని తెలిసినవారు చెప్పడంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె భర్త ఎండీ ఆసిఫ్ ఖాన్ (45), కూతురు మెహక్ సానియా(18), ఆసి్‌ఫఖాన్ చెల్లెలు నజియా భాను (30), హర్షియా బేగం(28), నజియా భాను కూతురు ఆయేషా (4), ఆసి్‌ఫఖాన్ బావ ఎండీ ఖాలేద్(43), ఆసి్‌ఫఖాన్ చిన్న తమ్ముడు అన్వర్ ఖాన్, నషిర్‌బేగ్(11), తయ్యబ్, అయాన్.. అంతా కలిసి ఏపీ 09 ఏ జెడ్ 3896 ఇన్నోవా వాహనంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు గురుమిట్ కల్ బయలుదేరారు.
ఉదయం 6.30 గంటల సమయంలో చేవెళ్ల మండలం మల్కాపూర్ గేట్ వద్దకు చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా.. చేవెళ్ల నుంచి మొయినాబాద్ వెళ్తున్న బోరువెల్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న 11 మందిలో ఆరుగురు.. నాజియా బేగం, ఆసిఫ్ ఖాన్, మెహక్ సానియా, నజియా భాను, అర్షియా బేగం, ఆయేషా అక్కడిక్కడే మృతిచెందారు.
ఎండీ ఖాలేద్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాళ్లు విరిగి, తీవ్రగాయాలపాలైన తయ్యబ్, అయాన్‌లను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తయ్యబ్ ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇక.. ఇన్నోవాలోని చివరి వరుస సీట్లలో కూర్చున్న నషీర్ బేగ్ (11), అన్వర్‌ఖాన్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీస్తుండడాన్ని చూసి.. తన కుటుంబసభ్యులంతా రక్తపుమడుగులో విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి.. చిన్నారి నషీర్ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాడు. ఏం జరిగిందో తెలియక కొంతసేపు షాక్‌లో ఉండిపోయాడు.
చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల వద్దకు వెళ్లి తల్లి మృతదేహం వద్ద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాడు. రోడ్డుపక్కన టైరుపై భయంగా కూర్చుని బిత్తరచూపులు చూస్తున్న నషీర్‌బేగ్‌ను చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. అతడిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఇన్నోవా డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
కాగా.. మృతదేహలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ప్రమాదాల దారి..
బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిలో మొయినాబాద్ నుంచి చేవెళ్ల మధ్యలో ఇప్పటి వరకు 68 ప్రమాదాలు జరగ్గా.. వాటిలో 81 మంది చనిపోయారు. జాతీయ రహదారి విస్తరణకు నోచుకోకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొయినాబాద్ నుంచి మన్నేగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు నేషనల్ హైవే అథారిటీకి అప్పగించారు. ఆరు లేన్ల రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా ఆరు నెలల క్రితం కేంద్రం కుదించింది. ఇప్పటి వరకు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.
ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న కాలంలో ఈ రోడ్డు ప్రమాదకరంగా ఉండడాన్ని గమనించి మలుపుల వద్ద కొద్దిమేర వెడల్పు చేయించారు. అయినా ప్రమాదాలు ఆగట్లేదు. ఇకనైనా కళ్లు తెరిచి రోడ్డు విస్తరణ పనులు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
సమీపంలోనే మరో ప్రమాదం
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
చేవెళ్లలో కారు, బోరు లారీ ఢీకొన్న చోటుకు కిలోమీటరు దూరంలోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. బైకుపై ప్రయాణిస్తున్న సునీల్‌కుమార్ (26) అనే యువకుడిని బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బుధవారం రాత్రి జరిగిందీ విషాదం. చేవెళ్ల మండలం ఉరెళ్లకు చెందిన గడ్డమీది సంజీవయ్య కొడుకు సునీల్‌కుమార్ నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం బైక్‌పై రాకపోకలు సాగిస్తున్నాడు.
రోజూ మాదిరిగానే బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా ముడిమ్యాల్ స్టేజి సమీపంలో పరిగి ఆర్టీసీ డిపో బస్సు.. అతడి బైక్‌ను ఢీకొంది. సునీల్‌కుమార్ అక్కడిక్కడే మృతిచెందాడు.
