ఆదర్శనీయుడు అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2020-04-15T08:25:09+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 129వ జయంతి ఉత్సవాలను మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఆదర్శనీయుడైన అంబేడ్కర్‌ బాటలో నడవాలని పలువురు

ఆదర్శనీయుడు అంబేడ్కర్‌

ఆయన అపర మేధావి: గుత్తా

అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు: జగదీశ్‌రెడ్డి

ఆశయ సాధనకు కృషి చేయాలి: ఇంద్రకరణ్‌ 

అంబేడ్కర్‌ బాటలోనే సీఎం కేసీఆర్‌: ప్రశాంత్‌ రెడ్డి

ఆయన అందరివాడు: ఎర్రోళ్ల శ్రీనివాస్‌

అంబేడ్కర్‌ ఆశయాలే ఆదర్శం: టీఎన్‌జీవోఏ


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 129వ జయంతి ఉత్సవాలను మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.   ఆదర్శనీయుడైన అంబేడ్కర్‌ బాటలో నడవాలని పలువురు మంత్రులు, ప్రముఖులు పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా భౌతిక దూరం పాటిస్తూ తమ ఇళ్లలోనే నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అంబేడ్కర్‌ అపర మేధావి అని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొనియాడారు. అంబేడ్కర్‌ అడుగు జాడల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని తన క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌లోని తన ఇంట్లో సత్యవతిరాథోడ్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు.


అంబేడ్కర్‌ అందరివాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. టీఎన్‌జీవోఏ కేంద్ర కార్యాలయంలోనూ, దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ(డిక్కీ) ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కరోనా కట్టడికి డిక్కీ రూ.25 లక్షలను సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళంగా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, డిక్కీ నేతలు చంటి రాహుల్‌ కిరణ్‌, కత్తెరపడక రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


’అంత్యోదయ’ అంబేడ్కర్‌ ఆలోచనే: సంజయ్‌

అంత్యోదయ సిద్ధాంతం అంబేడ్కర్‌ ఆలోచనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. దేశగమనాన్ని మార్చిన వెలుగు రేఖ అంబేడ్కర్‌ అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ కొనియాడారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లినందుకుగాను తనపై ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసు పెట్టడం అన్యాయమని పీసీసీ మాజీ చీఫ్‌ వి.హన్మంతరావు అన్నారు.  అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ నేతలు నివాళిని అర్పించారు.


టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దూం భవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, కె. రామకృష్ణ పాల్గొన్నారు. సుందరయ్య కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.

Updated Date - 2020-04-15T08:25:09+05:30 IST