నువ్వేంది.. నీ లెక్కేంది?
ABN , First Publish Date - 2020-06-01T08:26:17+05:30 IST
ఒకరు రాష్ట్ర మంత్రి.. మరొకరు ప్రతిపక్షానికి చెందిన కీలక నేత. ఒకే వేదికపై కూర్చున్న ఈ ఇద్దరి మధ్య రైతు రుణమాఫీ అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది.
- జగదీశ్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాగ్వాదం
- మీరు పీసీసీ చీఫ్‌గా ఉండటం
- మీ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు: జగదీశ్‌రెడ్డి
- నువ్వు మంత్రిగా ఉండటం ఈ జిల్లా దరిద్రం: ఉత్తమ్
నల్లగొండ, మే 31 (ఆంధ్రజ్యోతి): ఒకరు రాష్ట్ర మంత్రి.. మరొకరు ప్రతిపక్షానికి చెందిన కీలక నేత. ఒకే వేదికపై కూర్చున్న ఈ ఇద్దరి మధ్య రైతు రుణమాఫీ అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ తమ స్థాయిని మించి దూషణల పర్వం సాగించారు. ఒక దశలో ఒకరిపైకి మరొకరు దూసుకువెళ్లే వరకు పరిస్థితి దారితీసింది. ఆదివారం నల్లగొండ కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో నియంత్రిత సాగు విధానంపై నిర్వహించిన సమావేశంలో చోటుచేసుకుందీ సంఘటన. సమావేశంలో ముందుగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. తర్వాత.. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తున్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, రైతు రుణమాఫీ కూడా చేస్తున్నామని మాట్లాడుతుండగా.. మధ్యలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి కల్పించుకున్నారు. ‘అసలు రుణ మాఫీ జరిగిందా’ అని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.
జగదీశ్‌రెడ్డి: మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? మీ పార్టీ పాలనలో రాష్ట్రాల్లో కరెంటు దిక్కులేక రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో క్వింటాల్ ధాన్యాన్ని వెయ్యి రూపాయలకే అమ్ముతున్నారు. నీకు ఎంత కావాలో చెప్పు పంపిస్తా.
ఉత్తమ్: లేదు రూ.1200కు కొంటున్నాం
జగదీశ్‌రెడ్డి: మీటింగ్‌లో మర్యాద తప్పింది మీరు..
ఉత్తమ్: మర్యాదగా మీటింగ్ కొనసాగించండి
జగదీశ్‌రెడ్డి: మీరు మాట్లాడినప్పుడు నేను రాసుకుంటూ ఉన్నాను తప్ప మధ్యలో మాట్లాడలేదు. ఇది చర్చ కాదు.. అసెంబ్లీ కాదు. నేను ఏది చెప్పదలుచుకున్నానో అదే చెబుతా.. ఐ హావ్ రైట్
ఉత్తమ్: గొంతు పెంచుతున్నారు.. గొంతు తగ్గించి మాట్లాడండి
జగదీశ్‌రెడ్డి: ఆఫా్ట్రల్ నువ్వేంది?.. నీ లెక్కేంది?
ఉత్తమ్: నీ లెక్కేంది అంటే నీ లెక్కేంది మరి (మంత్రి వైపు సీరియ్‌సగా వచ్చారు)
జగదీశ్‌రెడ్డి: నువ్వో సీనియర్ లీడర్‌వి. నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచావ్. రుణమాఫీ అందలేదా? రుణమాఫీ చేసిన విషయం మా ముఖ్యమంత్రిగారు లెక్కలతో వివరించారు. ప్రిపేర్ అయి రాలేదని నువ్వు అప్పుడు సభ నుంచి పారిపోయావు.
ఉత్తమ్: నేను ఎక్కడ పారిపోయా? నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావ్. నువ్వు మంత్రిగా ఉండటం ఈ జిల్లా దురదృష్టం
జగదీశ్‌రెడ్డి: నువ్వు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం మీ పార్టీ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు.. ఇదే విషయాన్ని వారే చెబుతున్నారు.
చివరగా.. నేను మాట్లాడేది వినండి.. రాసుకోండి.. సభా మర్యాద పాటించండి అని మంత్రి కోరటంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది.
కొంటామని భరోసా ఇస్తారా?: ఉత్తమ్
గిట్టుబాటు ధర కాంగ్రెస్‌కు ఇష్టం లేదు: జగదీశ్
నల్లగొండ టౌన్, మే 31: రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవిధంగా పత్తి సాగు చేస్తే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తామని భరోసా ఇస్తారా అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. పత్తిని కొనుగోలు చేయబోమని సీసీఐ, సాగు తగ్గించాలని కేంద్రం చెబుతుండగా.. ఆ పంటనే సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నదన్నారు. నియంత్రిత సాగుపై నల్లగొండ కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సన్న రకాలు సాగుచేస్తే లాభాలు తక్కువగా ఉంటాయని, కర్ణాటకలో ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని ఆయన కోరారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదన్నారు. అభివృద్ధికి అవరోధాలు సృష్టించడమే లక్ష్యంగా వారు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.