త్వరలో షూటింగులకు అనుమతి

ABN , First Publish Date - 2020-05-29T09:42:02+05:30 IST

రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతులను మంజూరు చేసే అవకాశముందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అత్యుత్తమ పాలసీని రూపొందిస్తుందన్నారు. అందులో సినిమా, సీరియల్‌ షూటింగులకు

త్వరలో షూటింగులకు అనుమతి

హైదరాబాద్‌, మే 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతులను మంజూరు చేసే అవకాశముందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అత్యుత్తమ పాలసీని రూపొందిస్తుందన్నారు. అందులో సినిమా, సీరియల్‌ షూటింగులకు సంబంధించిన అనుమతులు, థియేటర్లను తెరవడం వంటి అంశాలున్నాయని చెప్పారు. అంతేగాక ప్రత్యేక విద్యుత్‌ టారిఫ్‌, ఫ్లెక్సి టికెటింగ్‌ ధరలు, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం, కళాకారులకు పెన్షన్లు వంటి అంశాలను పొందుపరుస్తామని తెలిపారు. గురువారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో సినీ, టీవీ రంగాలకు చెందిన వివిధ అసోసియేషన్ల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రవిగుప్తా, ఫిలిండెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిషోర్‌ బాబుతో కలిసి అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించారు. షూటింగ్‌ ప్రదేశాలు, సినిమా థియేటర్లలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తలసానికి వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని అసోసియేషన్ల ప్రతినిధులు అందించారు. ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల నుంచి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేక పాసులను మంజూరు చేయాలన్నారు. రాత్రివేళ కర్ఫ్యూ అమలు చేస్తున్న కారణంగా షూటింగ్‌ ముగిసిన తర్వాత ఆర్టిస్టులు, సిబ్బంది తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తలసాని దృష్టికి తీసుకువచ్చారు. దరఖాస్తు చేసుకుంటే పాసులు మంజూరు చేస్తామని అసోసియేషన్‌ ప్రతినిధులకు హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రవిగుప్తా చెప్పారు. షూటింగ్‌ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలు, ఏర్పాట్లపై కూడా చర్చించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని అసోసియేషన్ల ప్రతినిధులు స్పష్టం చేశారు. వారి సూచనలు, వినతులను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని తలసాని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సమావేశంలో వచ్చిన వినతులు, సూచనలతో నివేదికను రూపొందించి, సీఎం ఆమోదం కోసం పంపిస్తామని చెప్పారు.

Updated Date - 2020-05-29T09:42:02+05:30 IST