‘నవోదయ’లో సీట్లన్నీ స్టేట్‌ సిలబస్‌ విద్యార్థులకే

ABN , First Publish Date - 2020-09-29T07:30:24+05:30 IST

ఈసారి పదోతరగతిలో పరీక్షల్లేకుండానే గ్రేడింగ్‌లు కేటాయించడంతో జవహర్‌ నవోదయ విద్యాలయాల(జేఎన్‌వీ) ప్రవేశాల్లో స్టేట్‌ సిలబస్‌ విద్యార్థులు లబ్ధి పొందారు. మరోవైపు పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన సీబీఎస్‌ఈ విద్యార్థులకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం

‘నవోదయ’లో సీట్లన్నీ స్టేట్‌ సిలబస్‌ విద్యార్థులకే

  • 10వ తరగతి జీపీఏ ఆధారంగా ఎంపిక
  • సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఒక్కటీ రాలేదు 
  • గ్రేడింగ్‌ విధానంతో సెంట్రల్‌ సిలబస్‌ విద్యార్థులకు నష్టం
  • అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు


హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఈసారి పదోతరగతిలో పరీక్షల్లేకుండానే గ్రేడింగ్‌లు కేటాయించడంతో జవహర్‌ నవోదయ విద్యాలయాల(జేఎన్‌వీ) ప్రవేశాల్లో స్టేట్‌ సిలబస్‌ విద్యార్థులు లబ్ధి పొందారు. మరోవైపు పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన సీబీఎస్‌ఈ విద్యార్థులకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో జేఎన్‌వీలు ఉన్నాయి. వీటిలో 6 నుంచి 12వ తరగతి వరకు గురుకుల విధానంలో బోధన ఉంటుంది. 6వ తరగతిలో ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అయితే మధ్యలో ఖాళీ అయిన సీట్లకు ప్రత్యేక నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 11వ తరగతిలో ఖాళీగా ఉన్న 196 సీట్ల  కోసం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఒక్కో జేఎన్‌వీ పరిధిలో సరాసరిగా 20-35 సీట్ల వరకు ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారి జాబితాను ఈనెల 27న విడుదల చేశారు. ఇందులో అన్ని సీట్లు స్టేట్‌ సిలబస్‌ విద్యార్థులకే దక్కాయి. సీబీఎ్‌సఈ సిలబస్‌ విద్యార్థులకు ఒక్క సీటు కూడా రాకపోవడంతో తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతిలో పొందిన జీపీఏ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈసారి రాష్ట్రంలో పదోతరగతిలో పరీక్షల్లేకుండానే ఇంటర్నల్‌ (ఎస్‌ఏ, ఎఫ్‌ఏ) మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌లు కేటాయించారు. దీంతో ఈసారి మొత్తం పరీక్షకు హాజరుకావాల్సిన 5,34,903 మందిలో అందరూ ఉత్తీర్ణత సాఽధించగా.. వీరిలో 1.40 లక్షల మంది 10/10 జీపీఏ పొందారు. వీరి సంఖ్య ఈసారి ఎక్కువగా ఉండటంతో దరఖాస్తు చేసిన వారిలో సీట్లన్నీ వీరికే దక్కాయి. మరోవైపు సీబీఎ్‌సఈ పరీక్షలను లాక్‌డౌన్‌కు ముందే నిర్వహించారు. విద్యార్థులందరూ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 10/10 జీపీఏ సాధించినవారు దేశవ్యాప్తంగా చూసినా నామమాత్రంగా ఉంటారు. దీంతో ఈసారి జేఎన్‌వీ ప్రవేశాల్లో వీరికి ఒక్క సీటు కూడా లభించలేదు. ఈ విధానంతో తమ పిల్లలకు అన్యాయం జరిగిందని సీబీఎ్‌సఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. దీనిపై హైదరాబాద్‌లోని జేఎన్‌వీ ప్రాంతీ య శాఖ డిప్యూటీ కమిషనర్‌ అనసూయ మాట్లాడుతూ.. అన్ని జేఎన్‌వీల్లో సీట్ల భర్తీ కోసం గ్రేడ్‌ పాయింట్లను మార్కులతో కన్వర్షన్‌ చేసి మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తామని చెప్పారు.

Updated Date - 2020-09-29T07:30:24+05:30 IST