నౌహీరా కేసులన్నీ తెలంగాణకు బదిలీ
ABN , First Publish Date - 2020-12-19T08:04:57+05:30 IST
స్కీముల పేర్లతో వందల కోట్ల రూపాయల స్కాములకు పాల్పడ్డ హీరా గ్రూప్స్ అధినేత్రి నౌహీరా షేక్‌పై ఇతర ప్రాంతాల్లో నమోదైన

ఢిల్లీ నుంచి సీసీఎ్‌సకు బదిలీ అయిన కేసు..
కొనసాగుతున్న విచారణ
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): స్కీముల పేర్లతో వందల కోట్ల రూపాయల స్కాములకు పాల్పడ్డ హీరా గ్రూప్స్ అధినేత్రి నౌహీరా షేక్‌పై ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులు తెలంగాణకు బదిలీ అవుతున్నాయి. ఢిల్లీలో నమోదైన ఓ కేసును అక్కడి పోలీసులు హైదరాబాద్ సీసీఎ్‌సకు బదిలీ చేశారు. సామాన్య ప్రజల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించి వ్యక్తిగత ఖాతాల్లోకి దారిమళ్లించిన ఆరోపణలపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశీయుల నుంచి హీరా గ్రూప్స్‌లో పెట్టుబడుల పేరుతో రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు సీసీఎస్ విచారణలో వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులు సేకరించడం, నిధుల దారిమళ్లింపునకు సంబంధించి మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నౌహీరా షేక్‌తోపాటు సంస్థ ప్రతినిధులు బీజూ థామస్, మోలీ థామ్‌సను గతంలో విచారించింది.
నౌహీరా సంస్థ దేశవ్యాప్తంగా 1,72,114 మంది డిపాజిటర్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళతోపాటు అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు, సౌదీ అరేబియా, పశ్చిమాసియా దేశాల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు ఆధారాలు సేకరించారు. ఇప్పటికీ ఇంకా బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో తెలంగాణ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నందున.. అక్కడి పోలీసులు కేసుల్ని ఇక్కడికి బదిలీ చేస్తున్నారు. కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించిన కేసులో సీసీఎస్, ఈడీ విచారణ కొనసాగుతూనే ఉంది.