ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలి
ABN , First Publish Date - 2020-09-01T08:30:06+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ 2014, 2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

- 2న సీఎం అపాయింట్మెంట్ కోరా
- ఇవ్వకుంటే బిడ్డతో కలిసి దీక్షకు కూర్చుంటా
- కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- ప్రజలకిచ్చిన మాట కోసం బయటికొచ్చా: జయారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్ 2014, 2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలో 40వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, మెడికల్ కాలేజీని మంజూరు చేయాలన్నారు. ఈ అంశాలపై మాట్లాడేందుకు సెప్టెంబరు 2న సీఎం అపాయింట్మెంట్ కోరానని, అవకాశమిస్తే ఆ రోజన ఆయనను కలిసి ప్రజల సమస్యలు వివరిస్తానని, వాటికి పరిష్కారమూ కోరతానని చెప్పారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తన కుమార్తె జయారెడ్డితో కలిసి ప్రగతిభవన్ ముందు దీక్షకు కూర్చుంటానని చెప్పారు. ఎన్నికల్లో తన తరపున తన కూతురు జయారెడ్డే ప్రచారం చేసిందని, అందుకే ఇద్దరం కలిసి ప్రగతి భవన్కు వెళ్తామన్నారు. గాంధీభవన్లో సోమవారం ఆయన జయారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డిలో 40 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కేసీఆర్ను కోరానని చెప్పారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీని త్వరలోనే మంజూరు చేస్తానంటూ అసెంబ్లీలోనే సీఎం ప్రకటించారని, కానీ అమలు కాలేదన్నారు. రైతు రుణమాఫీ హామీ ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇంతవరకూ అమలు కాలేదని, దళితులకు మూడెకరాల భూమి ఏమైందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ జనాలు మర్చిపోయేటన్ని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. తన కుమార్తె ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఏడాదికోసారి అపాయింట్ మెంట్ ఇస్తారు. అయితే వారు పుట్టిన రోజు ఆశీర్వాదం కోసం వెళ్తున్నారు తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రం కాదు’’ అని విమర్శించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో తాను సంగారెడ్డిలో ఇంటింటా తిరిగి ప్రజలను ఓట్లు అడిగానని, సమస్యలను పరిష్కరిస్తానని మాటిచ్చానని, అందుకే ఇచ్చిన మాట కోసం కొట్లాడాలని బయటికి వచ్చామని జయారెడ్డి తెలిపారు. తమ వద్ద అధికారం లేదని, ప్రజల కోసం ప్రశ్నించడమే తమ పని అని అన్నారు. తన తండ్రి తమ కుటుంబం కంటే, ప్రజా సమస్యల పరిష్కారం గురించే ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పారు. సాయం కోసం ఎవరొచ్చి అడిగినా కాదనకుండా చేస్తారని అన్నారు.