మద్యం అమ్మకాల్లో కాస్త మందగమనం

ABN , First Publish Date - 2020-05-10T09:46:49+05:30 IST

మూడు రోజుల కంటే మద్యం అమ్మకాల్లో కొంత మందగమనం చోటుచేసుకుంది. మద్యం దుకాణాల వద్ద మందుబాబుల క్యూలు తగ్గాయి. విక్రయాలు సాధారణ రోజుల స్థాయికి పడిపోతున్నాయి.

మద్యం అమ్మకాల్లో కాస్త మందగమనం

మూడు రోజుల కంటే తగ్గిన క్యూలు


హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల కంటే మద్యం అమ్మకాల్లో కొంత మందగమనం చోటుచేసుకుంది. మద్యం దుకాణాల వద్ద మందుబాబుల క్యూలు తగ్గాయి. విక్రయాలు సాధారణ రోజుల స్థాయికి పడిపోతున్నాయి. శనివారం ఒక్కో దుకాణంలో రూ.2-3 లక్షల మేర విక్రయాలు జరిగాయి. దుకాణాలు మళ్లీ మూతపడతాయేమోనని కొందరు ఎక్కువ మోతాదులో మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో శనివారం రూ.60 కోట్ల వరకు విక్రయాలు సాగినట్లు అంచనా. కాగా మద్యం డిపోల నుంచి మాత్రం వైన్‌ షాపుల యజమానులు భారీగానే మద్యాన్ని లిఫ్ట్‌ చేస్తున్నారు. శనివారం రూ.147.08 కోట్ల విలువైన మద్యం, బీరును లిఫ్ట్‌ చేశారు. ఈ సరుకును వారి దుకాణాల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌, హోం డెలివరీ ద్వారా మద్యం విక్రయాలను ప్రోత్సహించాలని సుప్రీంకోర్టు సూచించడంతో ప్రభుత్వం దుకాణాలను మూసివేస్తుందేమోనన్న ఆందోళన నెలకొంది. అందుకే దుకాణాల యజమానులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. శనివారం 1.72 లక్షల కేసుల మద్యం, 67 వేల కేసుల బీరును లిఫ్ట్‌ చేశారు. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన 19 మద్యం డిపోలను  ఆదివారం కూడా తెరిచి ఉంచనున్నారు.

Updated Date - 2020-05-10T09:46:49+05:30 IST