ఎయిర్‌టెల్ బ్యాంక్, ఎన్‌ఎస్‌డీసీ ఆధ్యర్యంలో యువతకు శిక్షణ

ABN , First Publish Date - 2020-07-22T22:10:27+05:30 IST

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంయుక్తంగా గ్రామీణ యువతకు ఆర్థికరంగంలో శిక్షణ ఇవ్వనున్నాయి.

ఎయిర్‌టెల్ బ్యాంక్, ఎన్‌ఎస్‌డీసీ ఆధ్యర్యంలో యువతకు శిక్షణ

హైదరాబాద్: నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంయుక్తంగా గ్రామీణ యువతకు ఆర్థికరంగంలో శిక్షణ ఇవ్వనున్నాయి. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ శిక్షణతో గ్రామీణ ప్రాంత యువత ఆర్థికరంగంలో ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, పేమెంట్స్, ఇన్సూరెన్స్ తదితర అంశాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ సేవలు వ్యాప్తిచెందుతున్నాయి. ఈ క్రమంలో ఈ రంగంలో ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. అయితే ఈ ఉద్యోగాలకు సరిపడా నైపుణ్యాలున్న యువత లేకపోవడంతో ఈ అవకాశం వృధా అవుతోంది. ఈ క్రమంలోనే యువతకు శిక్షణ ఇవ్వడంలో అపారమైన అనుభవం ఉన్న ఎన్‌ఎస్‌డీసీ, భారీ నెట్‌వర్క్ ఉన్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రంగంలోకి దిగాయి. ఈ రెండు సంస్థలు కలిసి యువతకు ఫైనాన్స్ రంగంలో ఉద్యోగాలకు అవసరమైన కనీస నైపుణ్యాల్లో శిక్షణనిస్తాయి. ఈ ట్రైనింగ్‌లో ప్రతిభ కనబర్చిన వారికి ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తాయి.




దీనిపై ఎన్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ మనీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘దేశ ఆర్థిక ప్రగతికి ఫైనాన్స్ రంగం ఎంతో ముఖ్యమైనది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో చేతులు కలపడం ద్వారా గ్రామీణ యువతకు ఈ రంగంలో శిక్షణ ఇవ్వడమే మా లక్ష్యం. తద్వారా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి’ అని చెప్పారు.


‘భారత్‌లో అత్యధిక శాతం యువతే ఉంది. వీరంతా గ్రామాలు, పల్లెల్లోనే నివశిస్తున్నారు. దేశ వృద్ధిలో వీరంతా భాగస్వాములవడం ద్వారా వ్యక్తిగత కలలు, ఆశయాలను కూడా వారు సాకారం చేసుకునేలా చేయడమే మా లక్ష్యం. దీనికోసం ఎన్‌ఎస్‌డీసీతో చేతులు కలపడం చాలా సంతోషంగా ఉంది’ అని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుబ్రతా బిస్వాస్ పేర్కొన్నారు.

Updated Date - 2020-07-22T22:10:27+05:30 IST